Site icon HashtagU Telugu

AP Politics: ర‌చ్చ‌కెక్కిన కూట‌మి ఎమ్మెల్యేల మ‌ధ్య విబేధాలు.. ఆందోళ‌న‌లో శ్రేణులు

Ganta Srinivasa Rao Vs Vishnu Kumar Raju

Ganta Srinivasa Rao Vs Vishnu Kumar Raju

AP Politics: కూట‌మి ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఏపీలో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో అన్ని రంగాల్లో ఏపీ అభివృద్ధి ప‌థంలో ముందుకు దూసుకెళ్తోంది. కూట‌మిలో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు భాగ‌స్వాములుగా ఉన్నాయి. దీంతో క్షేత్ర స్థాయిలో ఆయా పార్టీల శ్రేణుల మ‌ధ్య విబేధాలు త‌లెత్త‌కుండా, అన్ని పార్టీల శ్రేణులు క‌లిసిముందుకు సాగేలా పార్టీల అధినేత‌లు ఎప్ప‌టిక‌ప్పుడు ఎమ్మెల్యేల‌కు, ముఖ్య‌నేత‌ల‌కు సూచ‌న‌లు చేస్తున్నారు. అయితే, ప‌లు జిల్లాల్లో ఎమ్మెల్యేల మ‌ధ్య , ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీల శ్రేణుల మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరుతున్నారు. తాజాగా.. బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య విబేధాలు ర‌చ్చ‌కెక్కాయి.

Also Read: BRS Silver Jubilee Celebrations : రేపు జరగబోయే బిఆర్ఎస్ సభ రద్దైందా..? అసలు నిజం ఇదే !

భీమిలి నియోజ‌క‌వ‌ర్గంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు, విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరిన‌ట్లు తెలుస్తోంది. ఫిలింనగర్ క్లబ్ లీజు వ్యవహారంలో వాళ్లిద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఎదురు ప‌డ్డారు. దీంతో తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా కలుగజేసుకుంటున్నారంటూ గంటా శ్రీ‌నివాస‌రావు విష్ణుకుమార్ రాజుపై సీరియస్ అయ్యారు. ఫిలింనగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని, కానీ ఎమ్మెల్యేకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారంటూ విష్ణు కుమార్ రాజును గంటా ప్రశ్నించారు. ఈ క్రమంలో విష్ణ కుమార్ రాజు స్పందిస్తూ.. మీరు అందుబాటులో లేకపోవడంవల్లే లీజు విషయంలో కలెక్టర్‌‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లాన‌ని సర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయినా, గంటా కోపంతో కారెక్కి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీంతో కూటమి నేతల్లో వీరి వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌‌గా మారింది.

Also Read: Humanity : మానవత్వం మంట కలిసిందనడానికి ఇదే ఉదాహరణ

ఫిల్మ్ క్లబ్ భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. పైగా ఫిల్మ్ క్లబ్ ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ నేత‌లు ఫిల్మ్ క్ల‌బ్ వ్య‌వ‌హారాల్లో కీల‌క పాత్ర పోషించారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స‌ద‌రు వైసీపీ నేత‌లు రాజీనామాలు చేశారు. ప్ర‌స్తుతం ఆ క్లబ్ కు సంబంధించిన‌ భూమి, భవనాల లీజుల విషయంలో అనేక వివాదాలు ప్రారంభమయ్యాయి. ఈ అంశంపై తనకేమీ సంబంధం లేకపోయినా విష్ణుకుమార్ రాజు జోక్యం చేసుకున్నార‌ని గంటా కొద్దిరోజులుగా ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఫిల్మ్ క్లబ్ లీజుల విషయంలో గంటాతో పాటు మరికొంత మంది మధ్య చర్చలు జరుగుతున్నాయని ఈ సమయంలో విష్ణుకుమార్ రాజు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం యాధృచ్చికం కాదని స్థానికంగా చ‌ర్చ జ‌రుగుతుంది. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఎదురుప‌డ‌టంతో ఈ వ్య‌వ‌హారం ర‌చ్చ‌కెక్కింది.