Site icon HashtagU Telugu

TDP Mahanadu: రాజమండ్రిలో టీడీపీ మహానాడు

Tdp Mahanadu In Rajahmundry

Tdp Mahanadu In Rajahmundry

TDP Mahanadu : పార్టీలోకి 40 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి రానున్నారని మాట్లాడిన ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. సీఎం జగన్ పది లక్షల కోట్ల అప్పులు చేశారన్న ఆయన లక్షా 25వేల కోట్ల పన్నులు ప్రజల నుంచి వసూలు చేశారని ఆ మొత్తం ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు జీతాల కోసం పోరాడాల్సిన దుస్థితి వచ్చిందన్న అచ్చెన్నాయుడు ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని వంద రూపాయల నాణెం తీసుకువస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశామన్నారు. ఇక రాజకీయంగా ఏపీలో నెలకొన్న అంశాలపై మాట్లాడిన అచ్చెన్నాయుడు 40 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో కి వస్తామని కోరుతున్నారని వెల్లడించారు.

రెండు నెలల్లో 100 సభలు

ఎన్టీఆర్ శతయంతి వేడుకల నిర్వహణపై ప్రధానంగా చర్చించినట్టు పోలిట్ బ్యూరో సభ్యులు వివరించారు. ముఖ్యంగా మే 28లోపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాలు, దేశ విదేశాల్లో తెలుగుదేశం అభిమానుల ఆధ్వర్యంలో మొత్తం 100 సభలు నిర్వహించాలని తీర్మానించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని సైతం ఏర్పాటు చేస్తూ తీర్మానంలో పేర్కొన్నారు. మే నెలలో రాజమండ్రిలో నిర్వహించనున్న మహానాడు (TDP Mahanadu) కోసం మరో కమిటీని కమిటీని ఏర్పాటు చేస్తూ తీర్మానాలు చేశారు.

5వేల రూపాయలతో శాశ్వత సభ్యత్వం

తెలంగాణలో ఆవిర్భావ సభ నిర్వహణ సహా.. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు అండగా ఉండాలని చర్చించినట్టు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమం వేగవంతం చేయాలనే అంశాలపై చర్చించినట్టు స్పష్టం చేశారు. వీటితోపాటు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం, 5 వేల రూపాయలకు శాశ్వత సభ్యత్వం అందించాలని తీర్మానించినట్టు వివరించారు. టీడీపీని ఇంటింటికి తీసుకువెళ్లి పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయనున్నట్టు కాసాని తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడిన పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి.. రెండు రాష్ట్రాల ప్రజల సమస్యలు, విభజన హామీలు నెలబెట్టుకునే అంశాలకు సంబంధించి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించామన్నారు.సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన ఈ పోలిట్ బ్యూరో సమావేశంలో ప్రధానంగా పార్టీ బలోపేతం సహా అధికార పక్షాల వైఫల్యాలను ఎండగట్టేలా కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ముగింపు సైతం చరిత్రలో నిలిచిపోయేలా ఉండేలా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది.

Also Read:  NTR Currency: ఎన్టీఆర్ పేరుతో కేంద్రం నాణెం విడుదల