Site icon HashtagU Telugu

AP Bandh : టీడీపీ పిలుపుతో ఏపీలో బంద్.. పోలీసుల 144 సెక్షన్

Ap Bandh

Ap Bandh

AP Bandh : చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ  పిలుపుమేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో బంద్ కొనసాగుతోంది. రాజకీయ కక్ష సాధింపుతో జరిగిన ఈ  అరెస్టును బంద్ ద్వారా ప్రజలు ఖండించాలని టీడీపీ కోరింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ అధినేత గొంతు నొక్కేందుకే ఇలా చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. అత్యవసర సేవల్లోని వారు మినహా మిగతా అన్ని వర్గాల వారు బంద్‌కి సహకరించాలని కోరారు. ఇక ఏపీ వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. అవాంఛనీయ ఘటనలేవీ జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. గుంపులుగా ర్యాలీలూ, నిరసనలూ చేపడితే అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Also read : Chandrababu: ఖైదీ నంబర్ 7691

ఇక ఈ బంద్‌ కు బీజేపీ దూరంగా ఉండగా.. జనసేన పార్టీ మద్దతును (AP Bandh)  ప్రకటించింది. శాంతియుతంగా బంద్‌లో పాల్గొనాలని ప్రజలను కోరుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘‘నేను జైలుకెళ్లాను.. అంతా జైలుకెళ్లాల్సిందే అనే విధానంతో జగన్ ముందుకు పోతున్నారు. చట్టాలు సంపూర్ణంగా పనిచేసి ఉంటే జగన్ సీఎం అయ్యేవాడు కాదు’’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.  ఇక బీజేపీ మాత్రం బంద్‌కి పిలుపు ఇవ్వలేదు. బీజేపీ బంద్ కు పిలుపు ఇచ్చినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చారు. ఇక సీఎం జగన్ ఈరోజు లండన్ నుంచి ఏపీకి తిరిగి వస్తారని తెలుస్తోంది. లండన్ లో చదువుకుంటున్న తన కూతుళ్లను చూసేందుకు వారం క్రితం జగన్, సీబీఐ కోర్టు నుంచి అనుమతులు పొంది వెళ్లారు. వాస్తవానికి ఈనెల 12 వరకు జగన్ లండన్ పర్యటన ఉండగా.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన ఒకరోజు ముందే వస్తున్నారని సమాచారం.