TDP Formation Day : తెలుగుదేశం పార్టీ.. తెలుగు ప్రజలందరికీ గర్వ కారణం. ఇది తెలుగు ప్రజల రాజకీయ ఐక్య వేదిక. సమాజంలోని బలహీనవర్గాల గొంతుక టీడీపీ. నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న టీడీపీని ఏర్పాటు చేశారు. సరిగ్గా నేడు తెలుగుదేశం 43వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈసందర్భంగా టీడీపీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలోని కీలక ఘట్టాల గురించి తెలుసుకుందాం..
Also Read :Leave America : ఆ ఫారిన్ స్టూడెంట్స్‌పై అమెరికా చర్యలు.. సంచలన ఈమెయిల్స్
టీడీపీ 43 ఏళ్ల ప్రస్థానంలో కీలక ఘట్టాలు
- మన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1983 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పాలన కొనసాగింది. దీంతో మరో రాజకీయ ప్రత్యామ్నాయం లేక ప్రజలు విసిగి వేసారిపోయారు.
- ఈ తరుణంలో ఉమ్మడి ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా టీడీపీ అవతరించింది.
- టీడీపీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు శాసనసభ ఎన్నికలు జరగగా, ఆరుసార్లు టీడీపీ గెలిచింది.
- ఎన్టీఆర్ హయాంలో(TDP Formation Day) 1983, 1985, 1989, 1994లలో శాసనసభకు ఎన్నికలు జరగ్గా 3 సార్లు టీడీపీ ఘన విజయం సాధించింది. గెలిచిన 3 సార్లూ 200కిపైగా స్థానాలు దక్కించుకుంది.
- 1984, 1991 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది.
- 1989, 2004, 2009, 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్ష పాత్రను పోషించింది.
- రెండు రూపాయలకు కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాల పంపిణీతో ఎన్‌టీఆర్ చరిత్రకెక్కారు.
- ఎన్‌టీఆర్ మండల వ్యవస్థకు రూపకల్పన చేసి పాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
- ఎన్‌టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడంతో తెలంగాణలో పెత్తందారీ వ్యవస్థ కుప్పకూలింది. భూమి రికార్డులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
- ఎన్‌టీఆర్ హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటిసారి బీసీ వర్గాలకు, మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. మహిళలకు మొదటిసారి ఆస్తి హక్కు కల్పించారు.
- 1983లో టీడీపీ తొలిసారి అధికారంలోకి వచ్చాక.. ఏడాదిన్నరలోనే నాదెండ్ల భాస్కరరావు టీడీపీని చీల్చారు. ఆయన కాంగ్రెస్ మద్దతుతో గద్దెనెక్కారు. తదుపరిగా ప్రజా ఉద్యమంతో ప్రతిపక్షాలన్నీ టీడీపీకి మద్దతిచ్చాయి. దీంతో నెల రోజుల్లోనే ప్రధాని ఇందిరాగాంధీ దిగివచ్చి మళ్ళీ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి చేశారు.
- వంగవీటి రంగా హత్య, తదితర పరిణామాల్లో 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది.
- 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఘనవిజయం సాధించి ఎన్టీఆర్ సీఎం అయ్యారు. అయితే ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం టీడీపీలో సంక్షోభానికి దారి తీసింది. ఎన్టీఆర్‌ను దేవుడిలా భావించే టీడీపీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు లక్ష్మీ పార్వతి పెత్తనాన్ని నిరసిస్తూ బయటకు వచ్చి చంద్రబాబును తమ నేతగా ఎన్నుకున్నారు. దాంతో ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.
- 1989లో కేంద్రంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, 1996-98లో కేంద్రంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలలో టీడీపీ కీలక పాత్ర పోషించింది. 1998, 1999లలో వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీదే కీ రోల్.
- నాదెండ్ల భాస్కరరావు సృష్టించిన ఆగస్టు సంక్షోభాన్ని టీడీపీ గట్టెక్కడంలో కీలక పాత్ర చంద్రబాబుదే.
- లక్ష్మీపార్వతి నుంచి టీడీపీని కాపాడుకుని నిలదొక్కుకునేలా చేయడంలో ముఖ్య పాత్ర బాబుదే.
- 2024లో ఎన్డీయే కూటమి ఏర్పాటులో టీడీపీ కీలక పాత్ర పోషించింది.