Site icon HashtagU Telugu

Chandrababu Naidu : వంద‌కు త‌గ్గేదెలే.!

ఉగాది నాటికి 100 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబునాయుడు భావిస్తున్నారు. ఆ మేర‌కు తొలుత ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిలుగా ఉన్న వాళ్ల‌ పేర్ల‌ను దాదాపుగా ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది. స‌మ‌న్వ‌య క‌మిటీలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలకు అభ్య‌ర్థిత్వాల‌ను కొంత టైం తీసుకుని ప్ర‌క‌టించాల‌ని యోచిస్తున్నారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిలుగా ఉన్న వాళ్ల‌లో కొంద‌రు అల‌స‌త్వం వ‌హిస్తున్నారని స‌ర్వేల సారాంశం. అలాంటి వాళ్ల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా ప‌క్క‌న పెట్టాల‌ని బాబు క‌స‌ర‌త్తు చేస్తున్నాడని తెలిసింది.ప‌లు మార్గాల ద్వారా తెలుగుదేశం పార్టీ స‌ర్వేల‌ను చేయిస్తోంది. తాజాగా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా సునీల్ ను నియ‌మించిన బాబు ఆయ‌న ద్వారా ప‌క్కా స‌ర్వేల‌ను ఆశిస్తున్నాడు. పార్టీ కేంద్ర కార్యాల‌యం ఇచ్చిన రిపోర్టు, లోకేష్ టీం చేస్తోన్న స‌ర్వేలు, సునీల్ చేసే స‌ర్వేల‌ను క్రోడీక‌రించి తుది అభిప్రాయానికి బాబు రానున్నాడట‌. ఆ మేర‌కు మాత్ర‌మే ఈసారి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే లోక్ స‌భ అభ్య‌ర్థుల విష‌యంలో ఒక క్లారిటీతో ఉన్న బాబు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థిత్వాల‌ను ఖ‌రారు చేయ‌డానికి సిద్ధం అవుతున్నాడు. ఉగాది నాటికి తొలి విడ‌త కనీసం 100 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌ని భావిస్తున్నాడ‌ని తెలుస్తోంది.

ఉగాది త‌రువాత చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర‌కు ప్లాన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. ఆ లోపు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌ని ప‌క్కా స్కెచ్ తో బాబు ఉన్నాడ‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. సాధార‌ణంగా చంద్ర‌బాబు ఎప్పుడూ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డంలో వెనుక‌డుగు వేస్తుంటారు. గ‌త ఎన్నికల్లో ముందుగా ప్ర‌క‌టించ‌డానికి బ‌దులుగా నామినేష‌న్ల చివ‌రి రోజుల్లో వెల్ల‌డించిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. చివ‌రి నిమిషంలో త‌డ‌బాటు కార‌ణంగా ప‌లు ఎన్నిక‌ల్లో న‌ష్ట‌పోయిన దాఖ‌లాలు లేక‌పోలేదు. ఈసారి అందుకు భిన్నంగా ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో పాటు వాళ్ల‌కు టాస్క్ ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌.ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి క‌నీసం ముగ్గుర్ని అభ్య‌ర్థిత్వం కోసం ప్ర‌మోట్‌ చేసే సంస్కృతి చంద్ర‌బాబు హ‌యాంలో ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగింది. ఆ క్ర‌మంలో మిగిలిన ఇద్ద‌రు ఎన్నిక‌ల స‌మ‌యంలో వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డం చాలా చోట్ల జ‌రిగింది. ఆ విధంగా 2004, 2009, 2014, 2019 ఎన్నిక‌ల్లోనూ జ‌రిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు కూడా పోటీగా కొంద‌రు లీడ‌ర్ల‌ను ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌మోట్ చేసిన ప‌రిస్థితుల‌ను చూశాం. ఈసారి అందుకు భిన్నంగా ప్ర‌తి నియోజ‌వ‌ర్గంలోనూ ఏక నాయ‌క‌త్వాన్ని ఉంచాల‌ని స్కెచ్ వేస్తున్నాడు. అందుకే, ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ద్వారా అసంతృప్తి వాదుల‌ను బుజ్జ‌గించుకునే స‌మ‌యం ఉంటుంద‌ని బాబు అంచ‌నా వేస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే క‌డ‌ప జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జి బీటెక్ ర‌విని రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థిగా ముంద‌స్తుగా ప్ర‌క‌టించాడు.

పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019 ఎన్నిక‌ల్లో స‌తీష్ రెడ్డి పోటీ చేశాడు. గ‌తంలోనూ ప‌లుమార్లు పులివెందుల నుంచి పోటీ చేసి ఓడిపోయిన స‌తీష్ రెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌విని టీడీపి ఇచ్చింది. ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వి ముగిసిన త‌రువాత సైలెంట్ గా ఉన్నాడు. సామాజిక కార్య‌క్ర‌మాల‌ను చురుగ్గా చేసే నాయ‌కునిగా స‌తీష్ రెడ్డికి పేరుంది. అందుకే, ఈసారి కూడా ఆయ‌న‌కే పులివెందుల టిక్కెట్ వ‌స్తుంద‌ని ఒక వ‌ర్గం ప్ర‌చారం చేయ‌డం ప్రారంభించింది. దీంతో ఇంచార్జిగా ఉన్న బీటెక్ రవికి ఇబ్బందిగా మారింది. బ‌హు నాయ‌క‌త్వం దిశ‌గా రాజ‌కీయాలు వెళుతున్నాయ‌ని బాబు గ్ర‌హించాడు. దానికి చెక్ పెట్టేలా పులివెందుల అభ్య‌ర్థిత్వాన్ని బీటెక్ ర‌వికి అప్ప‌గించాడు. ఇలాంటి నిర్ణ‌యాలు రాబోవు రోజుల్లో పలు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉంటాయ‌ని పార్టీ కేంద్ర కార్యాల‌యం భావిస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల‌కుగానూ క‌నీసం 100 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో పాటు మిగిలిన వాటిని కూడా స‌ర్వేల ఆధారంగా ఫైన‌ల్ చేయాల‌ని బాబు దూకుడుగా వెళుతున్నాడ‌ని టాక్‌. ఒక వేళ పొత్తు కుదిరితే..జ‌నసేన‌, వామ‌ప‌క్షాల‌కు అత్య‌ధికంగా 25 నుంచి 30 స్థానాల‌కు మించి ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తం 175 స్థానాల‌కుగాను 30 పోగా మిగిలిన స్థానాల‌కు రెండు విడ‌త‌లుగా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల‌ని బాబు యోచిస్తున్నార‌ని స‌మాచారం. తొలి విడ‌త 100 మ‌లివిడ‌త 40 నుంచి 50 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఫైన‌ల్ చేయాల‌ని స్కెచ్ వేశార‌ట‌. ఉగాది త‌రువాత చంద్ర‌బాబు వేసే అడుగులు చాలా దూకుడుగా ఉంటాయ‌ని పార్టీ వ‌ర్గాల వినికిడి. గ‌తానికి భిన్నంగా ఈసారి ఆయ‌న వేసే అడుగులు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో…చూడాలి.

Exit mobile version