Chandrababu Naidu: ఆ విషయంలో చంద్రబాబు కూడా జగన్ నే ఫాలో అవుతున్నారా?

టీడీపీ మహానాడును చూసినవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంతమంది జనంతో తెలుగుదేశం పార్టీ ఏ సభను నిర్వహించలేదు.

  • Written By:
  • Publish Date - May 29, 2022 / 03:00 PM IST

టీడీపీ మహానాడును చూసినవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంతమంది జనంతో తెలుగుదేశం పార్టీ ఏ సభను నిర్వహించలేదు. పైగా చంద్రబాబు కూడా ఇలాంటి జనసమీకరణను ప్రోత్సహించిన సందర్భమూ లేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండడం, పైగా ముందస్తు ఎన్నికల ఊహాగానాలు కూడా వెలువడుతుండడంతో టీడీపీ కూడా జాగ్రత్తపడింది. కానీ అది ఊహించిన దానికంటే.. రెండుమూడు రెట్లు ఎక్కువగా ప్రజలు మహానాడు బహిరంగ సభకు రావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు.

మహానాడు చివరిరోజున ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆరోజు మధ్యాహ్నం నాటికే 3 లక్షల మందికి పైగా ప్రజలు తరలివచ్చారని.. ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు.. ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. సభకు చుట్టుపక్కల కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ కావడంతో దాదాపు మరో రెండు లక్షల మంది అందులో ఇరుక్కుపోయి ఉంటారని అంచనా వేసినట్లు సమాచారం. అంటే ట్రాఫిక్ లేకుండా, సమయానికి వారు కూడా సభా ప్రాంగాణానికి చేరుకుని ఉంటే.. సుమారు ఐదు లక్షల మంది ఆ సభకు హాజరైనట్టు లెక్క.

ఒక సభకు మూడు లేదా ఐదు లక్షల మంది హాజరవ్వడం అంటే మాటలు కాదు. అది కూడా ప్రతిపక్షాల సభకు అంతమంది రావడం కష్టం. కానీ టీడీపీకి సభకు వచ్చారంటే ఏపీలో పొలిటికల్ లెక్కలు మారుతున్నాయా అన్న చర్చ జరుగుతోంది. జగన్ సర్కారు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఆదరణ లేకపోవడం, పైగా ఎమ్మెల్యేలు, మంత్రులను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తుండడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే దానికి బదులుగా మంత్రులు బస్సు యాత్రను చేపట్టారు. కానీ ఆ యాత్రకూ ఆదరణ కరువైంది. వైసీపీ సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.

ఇలాంటి సమయంలో టీడీపీ సభకు ఇంత భారీగా జనాలు తరలి వచ్చారంటే.. లెక్క మారుతోంది అని వైసీపీ వర్గాలు కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి గత ఎన్నికలకు ముందు జగన్ తన సభల్లో ఎక్కువమంది జనం ఉండేలా చూసుకునేవారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారంటున్నారు విశ్లేషకులు.