ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాధారణంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక పార్టీ తీసుకునే నిర్ణయాన్ని మరో పార్టీ వ్యతిరేకించడం పరిపాటి. అయితే తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో మాత్రం టీడీపీ, వైసీపీ ఒకే నిర్ణయం తీసుకోవడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించిన నేపథ్యంలో, ఆయనకు మద్దతుగా ఇరుపార్టీలు నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
CM Chandrababu : అమరావతి నిర్మాణానికి ఊపందిస్తున్న సీఆర్డీఏ.. ముఖ్య నిర్ణయాలు
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరినట్లు సమాచారం. అనంతరం వైసీపీ అధికారికంగా సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ప్రకటించింది. వైసీపీ ఎంపీ గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం వైసీపీకి లోక్‌సభలో నలుగురు, రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉండటంతో మొత్తం 11 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి లభించనున్నాయి. మరోవైపు ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీయైన టీడీపీ కూడా తమ మద్దతును ప్రకటించింది.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నప్పటికీ, వైసీపీ మాత్రం మళ్లీ ఎన్డీఏకు తోడుగా నిలిచింది. ఇంతకుముందు కూడా అంశాల వారీగా వైసీపీ, కేంద్రంలో ఎన్డీఏ నిర్ణయాలకు మద్దతు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. ఇక సంఖ్యాబలం పరంగా చూసుకుంటే, ఎన్డీఏ కూటమికి మెజారిటీ స్పష్టంగా ఉండటంతో సీపీ రాధాకృష్ణన్ విజయం లాంఛనమైపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి, ఈ ఎన్నికల సందర్భంగా ఏపీ ప్రధాన పార్టీలు ఒకే వేదికపై నిలవడం రాజకీయ విశ్లేషకులను ఆకట్టుకుంటోంది.