ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను భారీగా పెంచుతూ, బుధవారం విద్యుత్ నియంత్రణా మండలి (ఈఆర్ఎస్) కొత్త ఛార్జీలను ప్రకటించింది. దీంతో పెరిగిన ఛార్జీలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడబోతుంది. ఒకవైపు కరోనా పేరు చెప్పి, మరోవైపు ఉక్రెయిన్- రష్యా యుధ్ధం పేరు చెప్పి, ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో పాటు, డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర, పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిపోయాయి. అయితే కరెంట్ ఛార్జీలు కూడా పెంచడంతో.. పేద, మధ్య తరగతి వర్గాలపై పెనుభారం పడనుంది.
ఇక ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ నేతలు నిరసనలు చేపట్టారు. పేదలు విద్యుత్ ఛార్జీలు కట్టేందుకు దానం ఇవ్వాలంటూ భిక్షాటన చేపట్టిన టీడీపీ నేతలు, సిటీ బస్సులు ఆపి ప్రయాణికుల్ని బిచ్చమడిగారు. భిక్షాటన చేస్తే కానీ కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని, జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు మళ్లీ లాంతర్లతో బతికే రోజులొచ్చాయంటూ టీడీపీ నేతలు లాంతర్ల ప్రదర్శన చేపట్టారు.
ఇక ఫ్యాన్ పార్టీకి ఓటేసిన వాళ్ళు, ఇళ్ళల్లో ఫ్యాన్ వేసుకోకూడదన్నట్లు ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, జగన్రెడ్డి బాదుడే బాదుడు అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేశారు. ఇక మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసిన సీపీఐ నేతలు, పన్నులు, ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై సీఎం జగన్ వరుస భారాలు మోపుతున్నారని సీపీఐ నేతలు మండిపడ్డారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రో, గ్యాస్, నిత్యావసర ధరలను పెంచిందని, అది చాలదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం దుర్మార్గమైన చర్య అని, జగన్ ప్రభుత్వంపై సీపీఐ నేతలు ధ్వజమెత్తారు. మరి విద్యుత్ ఛార్జీల పెంపును జగన్ సర్కార్ ఏవిధంగా సమర్ధించుకుంటుందో చూడాలి.