Tammineni: త‌మ్మినేని త‌క‌దిమితో.! ఏపీ, తెలంగాణ రాజ‌కీయ చిత్ర‌మిదే.?

క‌మ్యూనిస్ట్ ల మ‌ద్ధ‌తు లేకుండా తెలంగాణ సీఎంగా మూడోసారి కేసీఆర్ కావ‌డం క‌ష్టం. ఆ విష‌యాన్ని మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లితం బ‌య‌ట‌పెట్టింది

  • Written By:
  • Updated On - November 22, 2022 / 05:26 PM IST

క‌మ్యూనిస్ట్ ల మ‌ద్ధ‌తు లేకుండా తెలంగాణ సీఎంగా మూడోసారి కేసీఆర్ కావ‌డం క‌ష్టం. ఆ విష‌యాన్ని మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లితం బ‌య‌ట‌పెట్టింది. ప్ర‌స్తుతం మారిన రాజ‌కీయ ప‌రిణామాల క్ర‌మంలో కామ్రేడ్లు కావాల‌ని గులాబీ బాస్ భావిస్తున్నార‌ట‌. అందుకే, మునుగోడు కేంద్రంగా ఒక అడుగు కేసీఆర్ ముందుకేసి కామ్రేడ్ల‌తో జ‌త క‌ట్టారు. ఇదే ఈక్వేష‌న్ వ‌చ్చే ఏడాది జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఉంటుంద‌ని టీఆర్ఎస్ శ్రేణుల్లోని వినికిడి. కానీ, పొత్తు ఉండొచ్చు, ఉండ‌క‌పోవ‌చ్చు అంటూ సీపీఎం నేత త‌మ్మినేని వీర‌భ‌ద్రం తాజాగా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

మునుగోడు వ‌ర‌కు క‌మ్యూనిస్ట్ పార్టీలు, టీఆర్ఎస్ పొత్తు పరిమితమంటూ త‌మ్మినేని చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జాతీయ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల దృష్ట్యా పొత్తు ఉంటుంద‌ని గులాబీ శ్రేణుల్లో వినిపిస్తోన్న మాట‌. 2009 ఎన్నిక‌ల్లోనూ ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు, టీడీపీ, టీఆర్ఎస్ క‌లిసి మ‌హా కూట‌మి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లింది. ఆనాడు జాతీయ రాజ‌కీయ ఈక్వేష‌న్లోనే కూట‌మి ఏర్ప‌డింది. ఈసారి కాంగ్రెస్, టీడీపీ, ఉభ‌య క‌మ్యూనిస్టులు, బీఆర్ఎస్ ఐక్యంగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే అవ‌కాశం లేక‌పోలేదు.

Also Read:  YS Jagan Meeting : జ‌గన్ స‌భ `ఒక్క ఫోటో`వందరెట్ల అభ‌ద్ర‌త‌!

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కు జాతీయ రాజ‌కీయాల్లో క‌లిసొస్తుంద‌ని రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఇటీవ‌ల సోనియాకు ఇచ్చిన రూట్ మ్యాప్‌. ఆ దిశ‌గా టీఆర్ఎస్, కాంగ్రెస్ క‌లిసి న‌డిచే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. కానీ, ఏపీలో మాత్రం వైసీపీ , కాంగ్రెస్ క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం దాదాపుగా లేదు. అందుకే, బీఆర్ఎస్, కాంగ్రెస్, క‌మ్యూనిస్ట్ ల కూట‌మిలో టీడీపీ ఇరు రాష్ట్రాల్లోనూ ఉండే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగితే, జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్‌, చంద్ర‌బాబు కీల‌క రోల్ పోషించడానికి అవ‌కాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌తో క‌లిసి న‌డిచేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ఓపెన్ ఆఫ‌ర్ కేసీఆర్ ప్ర‌కటించారు. బీజేపీ ప్ర‌భుత్వాన్ని దించ‌డ‌మే క‌మ్యూనిస్ట్ ల ల‌క్ష్యం. ఆ దిశ‌గా బీజేపీయేత‌ర పార్టీల కూట‌మితో కామ్రేడ్లు చేతులు క‌లుపుతారు. ఇక బీజేపీ దూరంగా పెడుతోన్న టీడీపీ కూడా మోడీ వ్య‌తిరేక కూట‌మితో జ‌త క‌ట్ట‌డానికి సిద్ధంగా ఉంటుంది. జాతీయ స్థాయిలో ఎన్డీయేను గ‌ద్దె దింపే ల‌క్ష్యంగా ప్రాంతీయ పార్టీల‌తో పొత్తు పెట్టుకోవ‌డానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ఇలా జాతీయ‌, రాష్ట్ర రాజ‌కీయ ప‌రిణామాల‌ను తీసుకుంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అతి పెద్ద కూట‌మిగా కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, క‌మ్యూనిస్ట్ పార్టీలు ఏర్ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు.

Also Read:  IT Raids : ఐటీ దాడుల‌పై `గులాబీ ద‌ళం`మంత్రాంగం