Janasena: ఏపీలో సంక్రాంతి సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సంక్రాంతి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సంక్రాంతి సందర్బంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందాలు, ఇతర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అయితే ఈ సంక్రాంతి సందర్భంగా ఏపీలో దాదాపు రూ. 2000 కోట్ల మేర పందాలు జరిగినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఈ పండుగ సందర్భంగా లోకల్ లీడర్లు కూడా తమకు ఉన్న వాల్యూ ఏంటో చూపించాలని అనుకుంటారు.
ఈ ఆలోచనతోనే చాలా మంది కూటమి పార్టీ నాయకులు కోడి పందాలు, ఇతర కార్యక్రమాల వద్ద పార్టీ పేరుతో తమ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఇలా కోడిపందాల వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన (Janasena) నేతకు పార్టీ భారీ షాక్ ఇచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రెస్ నోట్ విడుదల చేసింది. కోడి పందాల శిబిరాల వద్ద జనసేన పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు జనసేన నేత ముప్పా గోపాలకృష్ణ (రాజా)ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
Also Read: AI Cameras At Liquor Shops: మద్యం దుకాణాలలో AI కెమెరాల ఏర్పాటుపై నిషేధం.. కారణమిదే?
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు వద్ద నిర్వహించిన కోడి పందాలు ప్రాంగణంలో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది జనసేన పార్టీ విధానాలకు, ప్రతిష్టకు భంగకరమని అందులో పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైన మిమ్ములను (జనసేన నేత రాజా) పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడమైనదని అందులో రాసుకొచ్చారు. ఇకపై జనసేన పార్టీ కార్యక్రమాలతో రాజాకు ఎటువంటి అధికారికమైన సంబంధం లేదు అంటూ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
అయితే ఇలా సస్పెండ్ చేయడం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తప్పేముందని కొందరు పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో పార్టీ ఇప్పుడిప్పుడే బలపడుతుండటంతో ఇలాంటి సంస్కృతి వద్దని పవన్ జనసేన కార్యకర్తలను గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. పార్టీ నియమాలు ఉల్లంఘించిన వారి పట్ల కఠిన చర్యలు కూడా తీసుకోనున్నట్లు జనసేన పార్టీ గతంలోనే ప్రకటించింది.