Chandrababu Arrest: కాన్వాయ్‌కు దారి ఇవ్వాలని కోరిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు మద్దతుదారులు ఆయన అరెస్టుని ఖండిస్తున్నారు.

Chandrababu Arrest: ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు మద్దతుదారులు ఆయన అరెస్టుని ఖండిస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ మద్దతుదారులు చంద్రబాబు అరెస్ట్ సరైనదేనని చెప్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగే అవకాశం ఉన్నట్టు స్పష్టం అవుతుంది.

చంద్రబాబును సిట్ కార్యాలయానికి తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురు టీడీపీ కార్యకర్తలను చిలకలూరిపేటలో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు లాఠీచార్జి చేయడంతో కొందరు టీడీపీ వర్గీయులు గాయపడ్డారు. నిరసనను కవర్ చేస్తున్న కొందరు మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పెద్దఎత్తున టీడీపీ మద్దతుదారులు మహిళలతో సహా హైవేపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసనతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పదిండి. దీంతో చంద్రబాబును తీసుకువెళుతున్న పోలీసు వాహనం అరగంటకు పైగా నిలిచిపోయింది. ఈ సమయంలో చంద్రబాబు స్వయంగా తన మద్దతుదారులను కాన్వాయ్‌కు దారి ఇవ్వాలని కోరాడు.

నంద్యాలలో శనివారం తెల్లవారుజామున చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయ్యారని సీఐడీ అధికారులు తెలిపారు. గత రాత్రి పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం నంద్యాలలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రిని బస్సులో నుంచి అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకువస్తున్నారు. అతన్ని సిఐడి అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్న కాంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. ఇదేరోజు ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

Also Read: AP : కేవలం లోకేష్ , భువనేశ్వరి లకు మాత్రమే చంద్రబాబును కలిసే అవకాశం ఇస్తున్న పోలీసులు