Mahesh Babu: సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదైంది. ఈ పేరుతో నమోదైన ఓటులో హీరో మహేష్ బాబు ఫొటో కూడా ఉంది. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ఓటరు జాబితాలో దీన్ని గుర్తించిన ఎన్నికల అధికారులు అవాక్కయ్యారు. హీరో మహేశ్ బాబుకు వాస్తవానికి హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్‌లో ఇల్లు ఉంది. ఆయన ఓటు హక్కు కూడా హైదరాబాద్‌లోనే ఉంది. అలాంటిది గుంటూరులో కూడా మహేశ్ బాబుకు ఓటు ఉండటం ఏమిటి అనే ప్రశ్న ఎన్నికల అధికారులకు ఎదురైంది. దీంతో గుంటూరు పరిధిలో మహేశ్ బాబు(Mahesh Babu) పేరుతో నమోదైన ఓటరు గుర్తింపు కార్డులో ఉన్న వివరాలపై లోతుగా ఆరా తీశారు.
Also Read :Defection MLAs : సీఎల్పీ భేటీకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు దూరం.. ఎందుకు ?
ఫొటో, పుట్టినతేదీ, తండ్రిపేరు కరెక్టే.. మిగితావన్నీ అలా
గుంటూరు నగరానికి సంబంధించిన డోర్ నెంబర్ 31-22-1639తో ఆ ఓటర్ ఐడీ ఉంది. మహేశ్ బాబు విద్యార్హత బీకాం అని అందులో ప్రస్తావించారు. ఆయన పుట్టిన తేదీ 1975 ఆగస్టు 9 అని పొందుపరిచారు. మహేశ్ బాబు నిజమైన పుట్టిన తేదీ కూడా అదే. తండ్రి పేరు ఘట్టమనేని కృష్ణ అని కరెక్టుగానే రాశారు. బూత్ నంబర్ 214 వరుస సంఖ్య 1179 అని రాశారు. ఈవివరాలన్నీ తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు.. అది ఫేక్ సమాచారంతో తయారు చేసిన ఓటరు ఐడీ అని తేల్చారు. దీంతో వెంటనే దాన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు జాబితా నుంచి తొలగించారు.
Also Read :Maha Kumbh: సనాతన ధర్మంలోకి 200 మంది ఫారినర్లు.. మహాకుంభ మేళాలో ఆధ్యాత్మిక శోభ
అధికారుల స్పందన ఇదీ..
ఈవివరాలను గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, AERO చల్లా ఓబులేసు మీడియాకు వెల్లడించారు. ‘‘మహేష్ బాబు పేరుతో ఓటు తప్పుగా నమోదైం ది. ఫారం-7 విచారణ అనంతరం ఓటును తొలగించాం’’ అని ఆయన చెప్పారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నెల 10 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.