తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొవ్వూరు మండలం కాపవరంలోని తిరుమల స్కూలు భవనంపై నుంచి విద్యార్థి కిందపడి మృతి చెందారు. కుమారదేవ గ్రామానికి చెందిన విద్యార్థి రవిచంద్ర, రోజు మాదిరిగానే సోమవారం స్కూలుకు వచ్చారు. మధ్యాహ్న సమయంలో స్కూలు భవనంపై నుంచి కింద పడి రవిచంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో స్కూల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, విద్యార్థి మృతిపై కేసు నమోదు చేశారు. రవిచంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
విద్యార్థి మృతి కారణాలేంటి..?
‘‘అసలు రవిచంద్ర స్కూలు భవనంపై నుంచి ఎలా పడ్డారు? ఎందుకు స్కూలు పైకి వెళ్లారు? ఆడుకుంటూ అదుపు తప్పి కింద పడ్డారా.. లేదా ఎవరైనా నెట్టారా..? తోటి విద్యార్థులతో గొడవలేమైనా ఉన్నాయా..? లేదా రవిచంద్ర ఆత్మహత్య చేసుకున్నారా..’’ అనే కోణంలో విచారణ చేపట్టారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి మృతి చెందడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి తల్లిదండ్రులైతే శోకసంద్రంలో మునిగిపోయారు.
కానీ తలిదండ్రుల వేరేలా ఉంది.
తిరుమల స్కూల్‌లో జరిగిన తన కుమారుడి మరణ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయకపోతే అన్ని వ్యవస్థలను కోర్టుకు ఈడుస్తానని చిట్టూరి ప్రవీణ్ చౌదరి హెచ్చరించారు. సోమవారం ఉదయం సంఘటన జరిగినా, ఆ కుమారుడి తండ్రినైన తనకు మధ్యాహ్నం వరకు సమాచారం ఇవ్వలేదని ప్రవీణ్ ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు జరపాల్సిన పోలీసులు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు, తన కుమారుడిని ఇంతకు ముందే దత్తత ఇచ్చినట్లు చెప్పడం దుర్మార్గమని, అన్ని వ్యవస్థలను స్కూల్ యాజమాన్యం డబ్బుతో మేనేజ్ చేసిందని ఆరోపించారు. లక్షల ఫీజులు వసూలు చేస్తూ, కోట్లు సంపాదిస్తూ పిల్లల భద్రతను గాలికి వదిలేస్తున్నారని, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా చచ్చిపోయిందా అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా చేసిన చిట్టూరి ప్రభాకర చౌదరి మనుమడికి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ లీడర్ స్టాన్లీ చౌదరి కొడుకుగా, పేపర్ మిల్లు ట్రేడ్ యూనియన్ లీడర్‌గా ఉన్న తనకే ఇంత అన్యాయం జరిగితే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందని ప్రవీణ్ చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందులో ఏది నిజమో పోలీసులే తేల్చాలి!
