Vizag Steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సమ్మె సైరన్ మోగింది. జీతాలు పెంచాలని కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వంటి కారణాలతో కార్మికులు సమ్మెకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Koneru Konappa : కాంగ్రెస్‌కు కోనేరు కోనప్ప బై బై
జీతాలు సరిపోవడం లేదని, వెంటనే పెంచకపోతే బతకలేని పరిస్థితి ఉందని ప్లాంట్ యాజమాన్యానికి పలుమార్లు యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. పలు దఫాలు చర్చలు జరిపారు. కానీ జీతాల పెంపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు ప్లాంట్ యజమాన్యానికి కార్మికులు తాజాగా నోటీసులు అందజేశారు. 14 రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అయితే యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడంతో యాజమాన్యం కార్మిక సంఘాల నేతలతో చర్చించే అవకాశముంది.
కాగా, కేంద్రం తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.10300 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ఓవైపు ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్నా కేంద్రం భారీ సాయం ప్రకటించడంతో అంతా సర్దుకున్నట్లే అని భావించారు. అయితే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ సరిపోదంటూ కార్మిక సంఘాలు తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని నెలలుగా రెగ్యులర్ గా జీతాలు అందడం లేదని ఆరోపిస్తూ వారు సమ్మెకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక, రెండు, మూడు నెలలుగా ప్లాంట్ గాడిన పడుతున్నా తమకు జీతాలు మాత్రం ఇంకా బకాయిలు ఉన్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Read Also: Fact Check : హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌లోని బిల్డింగ్‌లో నుంచి భారీ ఫ్లై ఓవర్..!