శ్రీశైలం డ్యామ్ కు తక్షణ మరమ్మతులు అవసరం

Srisailam Dam ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్‌పూల్ మరమ్మతుకు మోక్షం లభించింది. మరమ్మతు పనులకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ).. సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. ప్లంజ్‌పూల్ మరమ్మతులపై అధ్యయనం చేసి.. డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సిఫార్సులు చేయనుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అంధ్రప్రదేశ్ జనవనరుల శాఖ చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం జల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం డ్యామ్ […]

Published By: HashtagU Telugu Desk
Srisailam Dam

Srisailam Dam

Srisailam Dam ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్‌పూల్ మరమ్మతుకు మోక్షం లభించింది. మరమ్మతు పనులకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ).. సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. ప్లంజ్‌పూల్ మరమ్మతులపై అధ్యయనం చేసి.. డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సిఫార్సులు చేయనుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అంధ్రప్రదేశ్ జనవనరుల శాఖ చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం జల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

  • శ్రీశైలం డ్యామ్ మరమ్మతు పనుల్లో కదలిక
  • టెక్నికల్ టీమ్ ఏర్పాటు చేసిన సీడబ్ల్యూసీ
  • ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన సిఫార్సులు

ఏళ్లుగా ఎదురుచూస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్‌పూల్ మరమ్మతు పనులకు మోక్షం లభిచింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ), ఏపీ జలవనరుల శాఖ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ). సీడబ్ల్యూసీ చీఫ్‌ ఇంజనీర్‌ (డిజైన్స్‌) వివేక్‌ త్రిపాఠి అధ్యక్షతన ఈ టెక్నికల్ టీమ్ ఏర్పాటు చేసింది. ఈ బృందంలో సోమేశ్‌ కుమార్‌, సుమంత్‌, అరుణ్‌ ప్రతాప్‌, మధుకాంత్‌ గోయల్‌ (జల సంఘం), మనీశ్‌ గుప్తా (సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌), ఎంకే వర్మ (సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌), శైలేంద్ర సింగ్‌ (జియొలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా), శ్రీశైలం డ్యాం చీఫ్‌ ఇంజనీర్‌ సభ్యులుగా నియమించింది. కాగా, తమ సభ్యుల పేర్లు కూడా వెల్లడించాలంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డును సీడబ్ల్యూసీ కోరింది. ఈ బృందం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి.. ప్లంజ్‌పూల్‌ మరమ్మతులపై అధ్యయనం చేయనుంది.

శ్రీశైలం డ్యామ్‌తో పాటు ప్లంజ్‌పూల్ మరమ్మతు అంశం ఆరేడేళ్లుగా మగ్గుతూ వస్తోంది. నిపుణుల కమిటీలు చేసిన సిఫార్సులు కూడా కాగితాలకే పరిమితం అయ్యాయి. శ్రీశైలం డ్యామ్ దిగువ భాగంలో ఆఫ్రాన్, ప్లంజ్‌పూల్ దెబ్బతినడంతో డ్యామ్ భద్రతకే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతేడాది ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం డ్యామ్‌ను పరిశీలించింది. ప్రాజెక్టు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీశైలం డ్యామ్‌, ప్లంజ్‌పూల్‌ మరమ్మతులపై తీసుకోవాల్సిన చర్యలపై 2025 మేలో సిఫార్సులు చేసింది.

ఎన్డీఎస్ఏ సిఫార్సుల ప్రకారం.. శ్రీశైలం డ్యామ్ దిగువన ఉన్న ఆప్రాన్‌ నుంచి నుంచి 50- 220 మీటర్ల వరకు గుంత ఏర్పడింది. అంతేకాకుండా ప్లంజ్‌పూల్‌లో లోతు 122 మీటర్ల నుంచి 160 మీటర్ల వరకు ఉంది. ఇది ఇలాగే ఉంటే డ్యామ్ స్పిల్ వే దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది. అలా జరగకుండా ఉండాలంటే.. స్పిల్‌వే దెబ్బతినకుండా ఏర్పాటు చేసిన సిలిండర్లలో ఒకటి నుంచి 39 వరకు మార్చాలని చెప్పింది. ఇక 8వ బ్లాక్‌ నుంచి 12వ బ్లాక్‌ వరకు స్టెబిలిటీ ఎనాలిసిస్‌ చేయాలని సూచించింది. అయితే ఈ సూచనలన్నీ కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి.

కాగా, ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు, ప్లంజ్‌పూల్‌కు ఏ మేర నష్టం జరిగింది అని నిపుణుల బృందం అంచనా వేయనుంది. సాంకేతిక సమీక్ష నిర్వహించి.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి డ్యామేజీలపై కేస్ స్టడీలను అధ్యయం చేస్తుంది. వాటిని పరిగణలోకి తీసుకుని.. అవసరమైన డ్రాయింగ్స్, డిజైన్స్ ఇవ్వనుంది.

 

 

  Last Updated: 21 Jan 2026, 11:42 AM IST