Site icon HashtagU Telugu

Hyderabad Common Capital : మ‌రో 30ఏళ్లు ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్?

Hyderabad Buildings

Hyderabad Buildings

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ప‌దేళ్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని. ఆ లోపుగా రాజ‌ధాని నిర్మించుకోలేని ప‌రిస్థితిలో ఏపీ ఉంటే, ఏమ‌వుతుంది? ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ ఉండేలా పొడిగిస్తారు. అంతేకాదు, హైద‌రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాల‌ని ప్ర‌తిపాద‌న కూడా ఉంది. వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని మ‌రో 30 ఏళ్లు ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ ఉంటుంద‌ని స‌రికొత్త ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ఆగిపోయింది. క‌నుక, విభ‌జ‌న చ‌ట్టం అనుస‌రించి ఏపీ, తెలంగాణ‌కు న్యాయం జ‌రిగేలా ఉమ్మ‌డి హైద‌రాబాద్ ను మ‌రో 30 ఏళ్లు కొన‌సాగించాల‌న్న డిమాండ్ వ‌స్తోంది. ఉమ్మ‌డి రాజ‌ధాని సాధ‌న‌తో పాటు ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కూ కృషి చేయ‌నున్నామ‌ని ఏపీ ఉద్య‌మకారులు గ‌ళం వినిపిస్తున్నారు. విప‌క్ష , అధికార ప‌క్ష నేత‌లు రాజ‌కీయాలు విడిచి రాష్ట్రం శ్రేయోస్సు కోసం త‌మ‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని అటు చంద్ర‌బాబును, ఇటు జ‌గ‌న్ ను వేడుకుంటున్నారు.

ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద్రాబాద్ ను డిక్లైర్ చేసి దాదాపు ఎనిమిదేళ్లు అయింది. మ‌రో రెండేళ్ల‌లో ఉమ్మ‌డి రాజ‌ధాని హైద్రాబాద్ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ ఉమ్మ‌డి రాజ‌ధాని అంశాన్ని తెర‌పైకి వ‌స్తోంది. అంటే ఆ రోజు ప‌దేళ్లు (విభ‌జ‌న చ‌ట్టం అనుస‌రించి) ఉమ్మ‌డి రాజ‌ధాని అని డిక్లైర్ చేశాక, ఏపీ స‌ర్కారు పెద్ద‌లు మాత్రం అక్క‌డ ఉండ‌లేం అని, ఓటు కు నోటు కేసు ఉదంతం త‌రువాత వ‌చ్చేశారు. త‌రువాత కాలంలో ఉమ్మ‌డి ఆస్తులు, ఉమ్మ‌డి హక్కుల‌పై ఎవ్వ‌రూ పెద్ద‌గా మాట్లాడిన దాఖ‌లాలు లేవు. తాజాగా మారుతున్న పరిణామాల నేప‌థ్యంలో మ‌ళ్లీ ఉమ్మ‌డి రాజ‌ధాని అన్న ప‌దాన్ని తెర‌పైకి వ‌స్తుంది. ఎందుకంటే, 9, 10 షెడ్యూల్ ఆస్తులు తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. వాటి విలువ సుమారు 5ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ఆ ఆస్తుల కోసం ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ ను వ‌దులుకునే ప‌రిస్థితి ఉండ‌దు. న్యాయ పోరాటం చేసైనా స‌రే హైద‌రాబాద్ ను ఉమ్మ‌డిగా ఉంచుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. లేదంటే 9, 10 షెడ్యూల్ ఆస్తుల‌ను పంచివ్వాల‌ని డిమాండ్ చేస్తుంది.

ఈ సారి ఉమ్మ‌డి రాజ‌ధాని ప‌ది కాదు ఇర‌వై కాదు ఏకంగా 30 ఏళ్లు ఉంచాల‌న్న డిమాండ్ తో కొంద‌రు ఉద్య‌మించేందుకు సిద్ధం అవుతున్నారు. ఒంగోలు కేంద్రంగా స్టూడెంట్ జేఏసీ నేత‌లు ఈ నినాదం వినిపిస్తున్నారు. ఇదే నినాదంతో తాము ఇక‌పై మ‌రింతగా కార్యాచ‌ర‌ణ‌ను విస్తృతం చేయ‌నున్నామ‌ని చెబుతున్నారు. ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఏపీ, టీజీల‌కు సంబంధించి భాగ్య‌న‌గ‌రిని ఉంచుతూ, 30 ఏళ్ల పాటు సంబంధిత నిర్ణ‌యం అమ‌లు అయ్యేలా చేయ‌మ‌ని కోరుతూ పార్ల‌మెంట్ లో చ‌ట్టం చేయ‌మ‌ని చ‌ట్ట స‌భ‌లకు చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను వీరంతా వేడుకుంటున్నారు..

విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు సాధ్యం కాని విష‌యంగా మారిపోయిన ప్ర‌స్తుత త‌రుణంలో కొన్ని పాత ప్ర‌తిపాద‌న‌లే తెర‌పైకి కొత్త రూపం అందుకుని వ‌స్తున్నాయి. రాజ‌ధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండిపోయింద‌న్న ఆవేద‌న‌తో రానున్న కాలంలో మ‌రిన్ని ఉద్య‌మాలు ఉమ్మ‌డి రాజ‌ధాని కొన‌సాగింపు దిశ‌గా సాగ‌నున్నాయి. రాజ‌కీయ పార్టీల తీరు ఎలా ఉన్నా విశ్వ విద్యాల‌యాల‌కు సంబంధించిన స్టూడెంట్ జేఏసీలు మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు పూర్తి స్థాయిలో చేయ‌డం అసాధ్యం. స‌రిగ్గా అదే అంశాన్ని వినిపిస్తూ మ‌రో 30 ఏళ్లు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉండేలా ఉద్య‌మించ‌డానికి ఏపీ స్టూడెంట్స్ సిద్ధం కావ‌డం విశేషం.