Pawan Kalyan: `ఇప్ప‌టం` విడిచి సాము చేస్తోన్న ప‌వ‌న్

`బోడిగుండుకి మోకాలికి ముడివేయ‌డం..` జ‌న‌సేన‌కు బాగా అల‌వాట‌ని అధికార‌ప‌క్షం చెప్పే మాట‌

  • Written By:
  • Updated On - November 5, 2022 / 02:13 PM IST

`బోడిగుండుకి మోకాలికి ముడివేయ‌డం..` జ‌న‌సేన‌కు బాగా అల‌వాట‌ని అధికార‌ప‌క్షం చెప్పే మాట‌. ఎందుకంటే, గుంటూరు జిల్లా ఇప్ప‌టం గ్రామం ప్ర‌జ‌లు జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ‌కు భూములు ఇవ్వ‌డానికి, రోడ్ల విస్త‌ర‌ణ‌కు జ‌న‌సేన ముడివేసింది. దానికి సంబంధించిన ఆధారం ఎక్క‌డా క‌నిపించ‌దు. కానీ, రాజ‌కీయ క‌ళ్ల‌ద్దాల‌తో చూస్తే క‌నిపించేలా ప‌వ‌న్ అండ్ టీమ్ ఫిక్స్ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల విస్త‌ర‌ణ జ‌ర‌గ‌డం నిరంతంర ప్ర‌క్రియ‌. ప‌లు చోట్ల నిర్వాసితుల‌యిన వాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌యాంలోనే కాదు, గ‌త ప్ర‌భుత్వాలు కూడా రోడ్ల విస్త‌ర‌ణ అవ‌స‌రం ఉన్న చోట చేసిన దాఖ‌లాలు బోలెడు. రోడ్ల విస్త‌ర‌ణ‌కు గ్రామ పంచాయతీలు, ప‌ట్ట‌ణాల్లో మున్సిపాలిటీలు, న‌గ‌రాల్లో కార్పొరేష‌న్లు తీర్మానాలు చేయ‌డంతో పాటు నోటీసులు జారీ చేయ‌డం జరుగుతుంది. ఇప్ప‌డం గ్రామంలోనూ అధికారులు అదే చేశారు. ఇప్ప‌టికి రెండుసార్లు నోటీసులు జారీ చేసిన‌ట్టు వెల్ల‌డించారు. ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గిస్తున్న‌ట్టు నోటీసులు జారీ చేసిన విష‌యాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఆ నోటీసులతో న్యాయ‌స్థానానికి వెళ్లే వెసుల‌బాటు ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు ఉంది.

Also Read:  Janasena: జనసేనాని హ‌త్య కుట్ర తూచ్‌! తేల్చేసిన పోలీస్!!

ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు మ‌ద్ధ‌తుగా ఇప్ప‌టం గ్రామానికి వెళ్లిన జ‌నసేనాని ప‌వ‌న్ మాత్రం రోడ్ల విస్త‌ర‌ణ అవ‌స‌రంలేద‌ని చెబుతున్నారు. ఆ విష‌యాన్ని గ్రామ పంచాయ‌తీ తేల్చాలి. స్థానిక సంస్థ‌ల‌కు ఉన్న అధికారాల‌ను ప‌వ‌న్ వ్య‌క్తిగ‌తంగా ప్ర‌శ్నించ‌డం చ‌ట్ట‌ప్ర‌కారం చెల్ల‌దు. రాజ‌కీయంగా ఆయ‌న చేసిన డిమాండ్ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు. కానీ, చ‌ట్ట ప్ర‌కారం పంచాయ‌తీ ప‌రిధిలోని అంశం. పైగా ఆ గ్రామ పంచాయ‌తీ ఇష్యూకి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి నేరుగా లింకు ఉండ‌క‌పోవ‌చ్చు. అయితే, ఇప్ప‌టం గ్రామం ప్ర‌జ‌లు స‌భ పెట్టుకోవ‌డానికి భూములు ఇచ్చార‌ని జ‌గ‌న్ క‌క్ష్య పూరితంగా చేస్తోన్న కార్య‌క్ర‌మం కింద ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపును ప‌వ‌న్ చూస్తున్నారు. దాన్ని నిరూపించాల్సిన అవ‌స‌రం ప‌వ‌న్ పార్టీ మీద ఉంది.

 

Also Read:   Pawan Kalyan visit Ippatam: ‘ఇప్పటం’ కోసం రక్తం చిందించడానికైనా సిద్ధం!

జ‌న‌సేనాని చెబుతోన్న దాని ప్ర‌కారం ఇప్ప‌టంలో 70 అడుగుల వెడల్పు రోడ్డు ఉంది. ఇప్పుడు దాన్ని 120 అడుగుల రోడ్డుగా మార్చేందుకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రోడ్డు వెడల్పు పేరుతో ఓటు వేయని వారి ఇళ్లను తొలగిస్తున్నార‌ని ఆరోప‌ణ‌. అత్యాచారాలు చేస్తున్న వారిని వదిలేసి, సామాన్యులను వేధిస్తున్నారని ప‌వన్ ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు, ఇలాగే ఉంటే ఇడుపులపాయలో హైవే వేస్తామని సినిమా స్టైల్ లో హెచ్చ‌రించ‌డం ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ విజ‌య‌వంతానికి ఉప‌యోగ‌ప‌డొచ్చ‌గానీ, కార్యరూపం దాల్చ‌డం ఈజీకాదు.

మరోవైపు ఇప్పటం గ్రామానికి బయల్దేరిన పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ వాహనాలను ఆపేశారు. దీంతో పవన్ దాదాపు 3 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ముందుకు సాగారు. ఆ తర్వాత కారుపైకి ఎక్కి ఇప్పటంకు పయనమయ్యారు. ఇప్పటంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మొత్తం మీద ప‌వ‌న్ ఇప్ప‌టం ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం అయింద‌ని జ‌న‌సేన భావిస్తోంది. గ‌త వారం రోజులుగా ప‌వ‌న్ మీద హ‌త్య కుట్రను పండించిన ఆయ‌న సానుకూల మీడియాకు మ‌రో వారం పాటు ఇప్ప‌టం చుట్టూ ఇష్యూను తిప్ప‌డానికి ఛాన్స్ దొరికింది. అంత‌కు మించి ప‌వ‌న్ ఇప్ప‌టం ప‌ర్య‌ట‌న వ‌ల్ల ఒరిగేది ఏమీ ఉండ‌దు. క‌నీసం ఆ పంచాయ‌తీ తీర్మానం రోడ్ల విస్త‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా చేయించ‌గ‌లిగితే జ‌న‌సేనాని పోరాటం కొంత వ‌ర‌కు ఫలించిన‌ట్టు అవుతుంది. లేదంటే, సినిమాటిక్ గా న‌డిచిన పోరాటాల్లో ఒక‌టిగా మిగిలిపోతుంద‌ని అధికార‌ప‌క్షం భావించ‌డంలో త‌ప్ప‌లేదేమో!

Also Read:  Pawan Kalyan: ఇడుపులపాయలో మీ ఇళ్ల మీదుగా హైవే వేస్తాం: పవన్ వార్నింగ్