PM Modi Tour: `మోడీ`కి మోదం, ఖేదం!

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న టైమ్ షెడ్యూల్ ఫైన‌ల్ అయింది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌ధానితో వేదిక‌ను పంచుకోనున్నారు

  • Written By:
  • Updated On - November 9, 2022 / 02:11 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న టైమ్ షెడ్యూల్ ఫైన‌ల్ అయింది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌ధానితో వేదిక‌ను పంచుకోనున్నారు. పండుగ వాతావ‌ర‌ణం మాదిరిగా మోడీ విశాఖ ప‌ర్య‌ట‌న ఉండేలా వైసీపీ రూప‌క‌ల్ప‌న చేసింది. ఈసారి కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌కు డుమ్మాకొట్టడానికి సిద్ధం అయ్యార‌ని తెలుస్తోంది. గ‌తంలో ప‌లు కార‌ణాల‌తో గైర్హాజ‌రు అయిన కేసీఆర్ ఈనెల 12న రామ‌గుండం రానున్న ప్ర‌ధాని టూర్ దూరంగా ఉండేందుకు ఏమి చేయ‌బోతున్నారో ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాదు, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ భగ్గుమంటోంది. రామగుండం వస్తే అగ్నిగుండమేనని విద్యార్థి జేఏసీ నేతలు హెచ్చరించారు. ఇదంతే కేసీఆర్ స‌ర్కార్ చేస్తోన్న ప్లాన్ గా బీజేపీ భావిస్తోంది.

గుజరాత్ ప్ర‌తిప‌క్ష పార్టీకి మ‌ద్థతు ప్ర‌క‌టించిన కేసీఆర్ ఆ రాష్ట్రానికి వెళ్లి ప్ర‌చారం చేయ‌డానికి ఈనెల 12వ తేదీన బెస్ట్ డే గా భావిస్తున్నార‌ట‌. ఆ మేర‌కు తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాల్లోని టాక్. ప్ర‌ధాని మోడీ తెలంగాణ‌కు వ‌చ్చే రోజున కేసీఆర్ గుజ‌రాత్ కు వెళితే బాగుంటుంద‌ని వాళ్ల ఉవాచ‌. ముచ్చింతల్ లో రామానాజాచార్యుల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌, భార‌త్ బ‌యోటెక్, ఐఎస్బీ స్కాత‌కోత్స‌వం..ఇలా ఏడాదిన్న‌ర‌గా మూడుసార్లు తెలంగాణ వ‌చ్చిన మోడీకి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఆయ‌న‌కు బ‌దులుగా మంత్రి శ్రీనివాస్ యాద‌వ్ ప్ర‌ధానికి ఆహ్వానం ప‌లికిన విష‌యం విదిత‌మే. ఈసారి రామ‌గుండం రానున్న ప్ర‌ధానికి స్థానిక మంత్రి స్వాగ‌తం ప‌లికేలా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read:  AP Medical Colleges: ‘ఎడ్యుకేషన్’ బిజినెస్ కాదు.. ఏపీ ప్రభుత్వంపై సుప్రీం సీరియస్!

ఈ నెల 11న సాయంత్రం మధురై విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 7.25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి ప్ర‌ధాని మోడీ చేరుకుంటారు. రాత్రికి చోళ షూట్ లో బస చేస్తారు. 12 తేదీ ఉదయం చోళ షూట్ నుంచి ఆంధ్ర యూనివర్శిటీకి చేరుకుంటారు. అక్కడి నుంచే రూ. 10,742 కోట్ల విలువైన ఐదు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇక‌, పూర్తయిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఉదయం 10.30 నుంచి 11.45 గంటల వరకు ఈ కార్యక్రమానికి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హాజ‌రు కానున్నారు. ఆ సంద‌ర్భంగా విప‌క్ష పార్టీల‌కు స్థానం లేకుండా తూర్పు గోదావ‌రి జిల్లా భీమవరంలో ఇటీవ‌ల జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ ప్రోగ్రామ్ మాదిరిగా జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది.

ఏపీలోని ప్రోగ్రామ్స్ ముగ‌సిని త‌రువాత ఈనెల 12వ తేదీన మ‌ధ్నాహ్నం 12 గంటలకు విశాఖ నుంచి తెలంగాణ‌లోని పెద్దపల్లి జిల్లా రామగుండం వద్ద ఉన్న ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అయితే, ప్రధాని పర్యటనపై తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ భగ్గుమంటోంది. రామగుండం వస్తే అగ్నిగుండమేనని విద్యార్థి జేఏసీ నేతలు హెచ్చరించారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు అంశంలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై విద్యార్థి జేఏసీ కొన్నిరోజులుగా ఆందోళనలు చేపడుతోంది. ఇప్పటికే ప్రారంభమైన ఎరువుల పరిశ్రమను మళ్లీ ప్రారంభించడం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికేనని విమర్శించారు. మొత్తం మీద ఏపీలో ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధం అవుతుండ‌గా, తెలంగాణ మాత్రం మోడీ ప‌ర్య‌ట‌న‌ను అగ్నిగుండంగా మార్చ‌డ‌నికి సై అంటోంది. ఇరు రాష్ట్రాల్లో ఈనెల 11, 12 తేదీల్లో ఏమి జ‌రుగుతుందో చూడాల్సిందే!

Also Read:  Rajahmundry : రాజ‌మండ్రి స‌మీపంలో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు