`మీరు క్రమశిక్షణలో లేరు. అలా ఉంటే ప్రజలు నమ్మరు` ఇదీ ఒకానొక సమయంలో పవన్ క్యాడర్ కు చెప్పిన మాటలు. ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. దానికి కారణంగా విశాఖ కేంద్రంగా ఈనెల 15వ తేదీన జరిగిన సంఘటన. మంత్రులపై రాళ్ల దాడి చేసిన జన సైనికులు, ఆ తరువాత మీడియా, సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ నాయకులు వాడుతోన్న పదజాలం గమనిస్తే ఏపీ ప్రజల్లో ఆందోళన కలగడం సహజం.
మూడు రాజధానుల అంశాన్ని రాజకీయంగా వైసీపీ బయటకు తీసుకొచ్చింది. మహాపాదయాత్ర కు కౌంటర్ గా ఆ పార్టీ గర్జనకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఒక వైపు అమరావతి టూ అరసవెల్లి మహాపాదయాత్ర టెన్షన్ మధ్య సాగుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు కొన్ని ఆంక్షల నడుమ ముందుకు వెళుతోంది. ఆ క్రమంలో ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు పెట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు యాత్ర ప్రవేశించే సమయానికి మరింత ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో పవన్ కూడా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు.
సహజంగా ప్రాంతాల మధ్య వైరుధ్యం ఏపీలో ఉంది. కానీ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ఉద్యమాలు ఒకప్పుడు నడిచాయి. ఆ తరువాత సమసి పోయినప్పటికీ ఉమ్మడి ఏపీ విడిపోయిన తరువాత నివురుగప్పిన నిప్పులా ఇష్యూ ఉంది. దాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకోవడానికి వైసీపీ బయటకు తీసింది. ఫలితంగా సున్నితమైన అంశం ఏపీని వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆచితూచి అడుగువేయాల్సిన రాజకీయ పార్టీలు ఎవరికివారే ఉత్తరాంధ్ర వైపు మళ్లారు. ఆ విషయం పవన్ దూకుడుగా వ్యవహరించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది.
Also Watch :
గతంలోనూ మెగా అభిమానులు, జనసైన్యంకు దాడులు చేసిన సంస్కృతి ఉంది. హీరో రాజశేఖర్ కుటుంబం వెళుతోన్న కారును వెంబడించి భయానక వాతావారణాన్ని ఒకప్పుడు సృస్టించారు. ఆ తరువాత సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి, కత్తి మహేష్ లాంటి వాళ్లపై బూతులతో యుద్ధం చేశారు. తాజాగా వైసీపీ లీడర్, సినీ నటుడు పోసాని మురళీకృష్ణ ఇంటి మీద దాడికి దిగారు. ఇదంతా చూస్తుంటే, రాబోవు రోజుల్లో పవన్ ఏది చెబితే ఏపీ ప్రజలు అది వినాలన్నట్టు జనసైన్యం ఉవాచగా ఉంది. అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా అధికారంలోని వైసీపీ ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు, పార్టీ ఆఫీస్ లను ధ్వంసం చేస్తూ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసింది.
వైజాగ్ వెళ్లిన పవన్ కల్యాణ్ ను వెళ్లిపోవాలని పోలీసులు నోటీసులు ఇచ్చే వరకు వ్యవహారం వెళ్లింది. ఈనెల 15న జరిగిన వైసీపీ గర్జన్, పవన్ హడావుడి రాష్ట్రంలో రాబోవు ఎన్నికల నాటికి ఏమి జరగబోతుందో సూచాయగా ప్రజలకు సంకేతాలు ఇచ్చారు. గుర్తింపు కూడా లేని జనసేన దూకుడును చూసి సామాన్యలు సైతం నోరు వెళ్లబెడుతున్నారు. ఆ పార్టీకి చెందిన లీడర్లు వాడే బూతు పదజాలం, జనసైన్యం హల్ చల్ గమనిస్తే క్రమశిక్షణ ఏ మాత్రం లేదని బోధపడుతుంది. అందుకేనోమో పక్రమశిక్షణ లేకపోతే ప్రజలు పవన్ హితబోధ చేస్తున్నారు.
