AP Special Status : ఏపీలో ‘ప్ర‌త్యేక’ పాలి ‘ట్రిక్స్’

ప్ర‌త్యేక హోదా అస్త్రాన్ని సంధించ‌డం ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని గ‌ద్దె దించాల‌ని టీడీపీ భావిస్తోంది.

  • Written By:
  • Publish Date - February 14, 2022 / 02:24 PM IST

ప్ర‌త్యేక హోదా అస్త్రాన్ని సంధించ‌డం ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని గ‌ద్దె దించాల‌ని టీడీపీ భావిస్తోంది. 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌త్యేక హోదా ఆయుధాన్ని ఆనాడు చంద్ర‌బాబు మీద జ‌గ‌న్ విసిరాడు. సెంటిమెంట్ ను పండించ‌డంతో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాడు. అప్ప‌టి వ‌ర‌కు ఎన్టీయేలో భాగ‌స్వామిగా ఉన్న తెలుగుదేశం బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ప్ర‌త్యేక‌హోదా. ఎంపీల రాజీనామాల‌తో చంద్ర‌బాబు పైన ఒత్తిడి పెంచాడు. ప్ర‌త్యేక ప్యాకేజీకి అంగీక‌రించిన బాబు స‌ర్కార్ పై హోదా అస్త్రాన్ని బలంగా విసిరాడు. సీన్..క‌ట్ చేస్తే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి 151 స్థానాలు తెచ్చిపెట్టింది. 22 మంది ఎంపీలు గెలుచుకునేలా చేసింది.అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత దేవుడి ద‌య ఉంటే ప్ర‌త్యేక‌హోదా వ‌స్తుంద‌ని జ‌గ‌న్ నాలుక మ‌డ‌త వేశాడు. కేంద్ర ప్ర‌భుత్వానికి వైసీపీ మద్ధ‌తు అవ‌స‌రం లేదు, కాబ‌ట్టి ప్ర‌త్యేక హోదాను అడిగిన‌ప్ప‌టికీ ఇచ్చే అవ‌కాశం లేద‌ని జ‌గ‌న్ తేల్చేశాడు. ప్ర‌త్యేక హోదాను అడిగేందుకు కూడా ధైర్యం చేయ‌పోతున్నాడు. ఆ విష‌యాన్ని దాదాపుగా మారిచిపోయేలా చేశాడు. పార్ల‌మెంట్ వేదిక‌గా చేసిన చ‌ట్టం ప్ర‌కారం ఇవ్వాల్సిన హోదాపై నోరుమెదిపే ధైర్యం వైసీపీ ఎంపీలు చేయ‌లేక‌పోతున్నారు. రాజీనామా చేసి నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డానికి సాహ‌సం చేయ‌లేని నిస్స‌హాయ‌స్థితికీ వైసీపీ వెళ్లింది.

Also Read : CM KCR : ‘కేసీఆర్’ నేల‌విడ‌చి సాము

ప్ర‌త్యేక హోదా ముసిగిన అధ్యాయ‌మ‌ని ప‌లుమార్లు కేంద్రం చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫార‌స్సుల ప్ర‌కారం హోదాను ఇవ్వ‌లేమ‌ని తేల్చేసింది. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ ఏ మాత్రం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డంలేదు. ఇటీవ‌ల తెలంగాణ‌, ఏపీ మ‌ధ్య పెండింగ్ లో ఉన్న అంశాల‌పై మోడీని క‌లిసిన జ‌గ‌న్ ఒక విన‌తిపత్రం అందించాడు. విభ‌జ‌న చ‌ట్టంలోని 9, 10 షెడ్యూల్ ఆస్తుల పంపిణీ, వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు అందాల్సిన నిధుల‌తో స‌హా ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించాడు. కానీ, ప్ర‌త్యేక‌హోదాను మాత్రం మోడీకి ఇచ్చిన విన‌తిప‌త్రంలో పొందుప‌ర‌చ‌డానికి కూడా జ‌గ‌న్ ధైర్యం చేయ‌లేక‌పోయాడు. ఏపీ సీఎం ఇచ్చిన విన‌తిప‌త్రంపై స్పందించిన మోడీ స‌ర్కార్ ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈనెల 17న ఆ క‌మిటీ స‌మావేశం కానుంది. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న వివాద‌స్ప‌ద అంశాల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌బోతుంది.విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు కోసం ఏర్పాటు చేసిన ఆ క‌మిటీ ఎజెండాలో తొలుత ప్ర‌త్యేక హోదాను కూడా చేర్చుతూ కేంద్రం ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీంతో హోదాపై మ‌ళ్లీ ఏపీ ప్ర‌జ‌ల‌కు ఆశ‌లు చిగురించాయి. కానీ, 24 గంట‌ల తిర‌గ‌క‌కుండానే ఆ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌త్యేక హోదా లేకుండా ఎజెండాని ఫిక్స్ చేస్తూ తాజా ఉత్త‌ర్వులను కేంద్రం జారీ చేసింది. విప‌క్షాలు కేంద్రం వైఖ‌రిపై మండిపడుతున్నాయి. ఈనెల 17వ తేదీన జ‌రిగే కీల‌క స‌మావేశంలో ప్ర‌త్యేక హోదా అంశం లేకుండా కేంద్రం జాగ్ర‌త్త ప‌డింది. విభ‌జ‌న చ‌ట్టంలోని మిగిలిన అంశాల‌న్నింటినీ పొందుప‌రిచింది. వాటిపై ఉన్న‌తాధికారులు స‌మావేశం కావ‌డానికి సిద్ధం అయ్యారు.

Indira Shoban: ఢిల్లీ పీఠాన్నే గెలిచినోళ్లం.. ఇక గల్లిలో గెలవలేమా?

ఇదే అంశాన్ని టీడీపీ ప్ర‌స్తుతం హైలెట్ చేస్తోంది. ప్ర‌త్యేక హోదాను తొలగించి నిర్వ‌హిస్తోన్న ఆ మీటింగ్ కు ఏపీ ప్ర‌భుత్వం ఎలా హాజ‌రువుతుంద‌ని నిల‌దీస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి చేయ‌కుండా జ‌గ‌న్ స‌ర్కార్ త‌లాడిస్తోంద‌ని విమ‌ర్శిస్తోంది. హోదా సాధ‌న కోసం ఎంపీలు రాజీనామా చేసి ఉద్య‌మానికి ముందుకు రావాల‌ని డిమాండ్ చేస్తోంది. ఎంపీలు అంద‌రూ రాజీనామా చేసి నిర‌స‌న తెలియ‌చేస్తే మోడీ స‌ర్కార్ దిగొస్తుంద‌ని టీడీపీ చెబుతోంది. అందుకే, టీడీపీ ఎంపీలు ముగ్గురు రాజీనామా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ల‌తో క‌లిసి వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాల‌ని విప‌క్షా నేత‌లు జ‌గ‌న్ ను కోరుతున్నారు.2019 ఎన్నిక‌ల ముందు తొలుత వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మం చేయ‌డానికి సిద్ధమంటూ స‌వాల్ విసిరారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు ఆనాడు హోదాను బ‌లంగా తీసుకువెళ్లారు. అప్ప‌ట్లో అధికారంలో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫ‌లితంగా ఎన్టీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బీజేపీ పై వ్య‌తిరేక పోరాటానికి చంద్ర‌బాబు దిగాడు. ధ‌ర్మ‌యుద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని ఎండ‌గ‌డుతూ బాబు స‌భ‌ల‌ను నిర్వ‌హించాడు. కానీ, ప్ర‌త్యేక ప్యాకేజీకి అంగీక‌రించిన బాబు మాట‌ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌లేదు. ప్ర‌త్యేక హోదాను తెస్తాన‌ని హామీ ఇచ్చిన జ‌గన్మోహ‌న్ రెడ్డిని న‌మ్మారు.

ఇప్పుడు సీన్ రివ‌ర్స్ న‌డుస్తోంది. ఎన్టీయేలో వైసీపీ భాగ‌స్వామి కాన‌ప్ప‌టికీ స‌హ‌జ మిత్రులుగా వైసీపీ, బీజేపీ న‌డుస్తున్నాయి. అందుకే, కేంద్రానికి ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ మ‌ద్ధ‌తు ఇస్తున్నాడు. రైతుల విద్యుత్ మోటార్ల‌కు మీట‌ర్లు పెట్ట‌డానికి కూడా అంగీక‌రించాడు. పార్ల‌మెంట్ వేదిక‌గా ప‌లు బిల్లుల‌కు వైసీపీ మ‌ద్థ‌తు ఇచ్చింది. బ‌య‌ట నుంచి ఎన్టీయేకు మ‌ద్థ‌తు ఇస్తోన్న జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌త్యేక హోదా గురించి అడ‌గ‌డానికి ధైర్యం చేయ‌లేక‌పోతోంది. అందుకే, వైసీపీ ఎంపీల రాజీనామాలు చేసి పోరాటానికి రావాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తోంది. 2019లో బాబు స‌ర్కార్ పై ఏ విధంగా వైసీపీ రాజ‌కీయ గేమ్ న‌డిపిందో..అలాంటి గేమ్ ను ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కార్ పై టీడీపీ ప్రారంభించింది. ఆనాడు ప్ర‌త్యేక హోదా అస్త్రంతో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ను అదే అస్త్రంతో గ‌ద్దె దించాల‌ని టీడీపీ భావిస్తోంది. హోదాను హోదాతోనే తీయాల‌ని మాస్ట‌ర్ స్కెచ్ వేసింది. అందుకే, ఈనెల 17వ తేదీన జ‌రిగే మీటింగ్ ఎజెండాలో ప్ర‌త్యేక హోదా లేక‌పోవ‌డాన్ని రాజ‌కీయ అస్త్రంగా టీడీపీ సంధించింది.