Site icon HashtagU Telugu

Suryakantham: గయ్యాళిఅత్తకు అరుదైన గుర్తింపు.. తపాలాశాఖ ప్రత్యేక కవరు!

తెలుగు చలనచిత్ర రంగంలో ‘సహజనటి’గా, గయ్యాళి అత్తగా పేరుగాంచిన డాక్టర్‌ సూర్యకాంతం పేరున తపాలాశాఖ ప్రత్యేక కవరు విడుదల కానుంది. ఈ నెల 18న దీనిని ఆవిష్కరించనున్నట్టు కాకినాడ డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ డీఎస్‌యూ నాగేశ్వర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమె కాకినాడకు చెందినవారు. తెలుగు వెండితెరపై గయ్యాళి అత్తయ్యగా పేరుపొందిన ఈ నటీమణి పేరున కాకినాడలో ‘ప్రత్యేక తపాలా చంద్రిక ఆవిష్కరణ’ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి MP వంగా గీత, MLA ద్వారంపూడి, మేయర్‌ శివప్రసన్న, విశాఖ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ M వెంకటేశ్వర్లు హాజరవనున్నారు.

సూర్యకాంతం 1924 అక్టోబర్ 28న సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయ పురం ఆమె స్వస్థలం. ఆరేళ్ళ ప్రాయంలోనే నాట్యం, సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. హిందీ పాటలు వింటూ చక్కగా నృత్యం చేసేవారు సూర్యకాంతం. అది చూసి సమీపబంధువులు కొన్ని ప్రదర్శనలు ఇప్పించారు. కొన్ని నాటకాల్లోనూ నర్తించారు. ఆ పై మదరాసు చేరి జెమినీ స్టూడియోస్ లో స్టాఫ్ ఆర్టిస్ట్ గా చేరారు. జెమినీ సంస్థ నిర్మించిన ‘చంద్రలేఖ’లో తొలిసారి తెరపై కనిపించారు. కొన్ని చిత్రాలలో నటించిన తరువాత ఎల్వీ ప్రసాద్ తెరకెక్కించిన ‘సంసారం’ చిత్రంలో శేషమ్మ పాత్రలో సూర్యకాంతం నటన ఆకట్టుకుంది.

“పెళ్ళి చేసి చూడు, అమ్మలక్కలు, చక్రపాణి, ప్రేమ, దొంగరాముడు, కన్యాశుల్కం, చరణదాసి, ఇలవేల్పు, పెంకిపెళ్ళాం, మాయాబజార్, తోడికోడళ్ళు, అప్పుచేసి పప్పుకూడు, మంచి మనసుకు మంచిరోజులు, మాంగల్యబలం, వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, కలసివుంటే కలదు సుఖం, గుండమ్మ కథ, రాముడు-భీముడు” వంటి చిత్రాలలో సూర్యకాంతం పలు విలక్షణమైన పాత్రల్లో అలరించారు. వాటిలో అధికభాగం గయ్యాళి పాత్రలే కావడం విశేషం.

Exit mobile version