Site icon HashtagU Telugu

APSRTC : విజయవాడ నుండి ప్రయాగ్ రాజ్‌ కు ప్రత్యేక బస్సులు..

Vjd To Prayagraj

Vjd To Prayagraj

ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా 2025లో భాగంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివెళుతున్నారు. ఈ పవిత్ర కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని APSRTC ప్రత్యేక బస్సు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. విజయవాడ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులను APSRTC నడిపేందుకు సిద్ధమైంది. ఈ యాత్రలో భాగంగా కేవలం మహా కుంభమేళాకి మాత్రమే కాదు, ప్రయాగ్‌రాజ్‌తో పాటు అయోధ్య, కాశీ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా 8 రోజుల టూర్ ప్లాన్ రూపొందించింది. ఈ ప్యాకేజ్ లో ప్రయాణ సౌకర్యం తో పాటు భోజన వసతి వంటి అన్ని సదుపాయాలను అందిస్తున్నట్లు APSRTC ప్రకటించింది.

Chandrababu Cases : చంద్రబాబు‌కు ‘సుప్రీం’లో భారీ ఊరట.. ఒక్క మాట వినకుండానే ఆ పిటిషన్ కొట్టివేత

బస్సు వేళలు చూస్తే..

ఫిబ్రవరి 1 శనివారం ఉదయం విజయవాడ PNBS నుంచి బస్సులు స్టార్ట్ అవుతాయి
ఫిబ్రవరి 2 ఆదివారం సాయంత్రం యాత్రికులు ప్రయాగరాజ్‌ చేరుకుంటారు
ఫిబ్రవరి 3 సోమవారం ప్రయాగ్ రాజ్‌లోనే బస చేయాల్సి ఉంటుంది
ఫిబ్రవరి 4 మంగళవారం రాత్రి ప్రయాగ్ రాజ్ నుంచి అయోధ్యకు బయలుదేరుతారు
ఫిబ్రవరి 5 బుధవారం ఉదయం అయోధ్య చేరుకుని బాల రాముడిని దర్శించుకుంటారు…ఇదే రోజు రాత్రి కాశీ ప్రయాణం ఉంటుంది
ఫిబ్రవరి 6 గురువారం వారణాసికి చేరుకుని ఆ రోజు అక్కడే దర్శనాలు చేసుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు
ఫిబ్రవరి 7 శుక్రవారం ఉదయం వారణాసి నుంచి బయలుదేరి ఫిబ్రవరి 08 ఉదయానికి విజయవాడ చేరుకుంటారు. మొత్తం ఫిబ్రవరి 1 నుంచి 8 వరకూ..అంటే శనివారం నుంచి శనివారం వరకూ టూర్ ప్లాన్ కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా పిల్లలు, పెద్దలకు ఛార్జీల విషయంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. అందరకీ టికెట్ రేట్ ఒకటే. సూపర్‌ లగ్జరీ కి 8 వేల రూపాయలు, స్టార్‌ లైనర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌ కి 11 వేల రూపాయలు, వెన్నెల ఏసీ స్లీపర్‌ కి 14 వేల 500 రూపాయలు ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈ ఛార్జీలు కేవలం టికెట్ మాత్రమే.. భోజనం, వసతి ఖర్చులు ఎవరికి వారే పెట్టుకోవాలి.

యాత్రకు వెళ్లాలి అనుకుని ప్లాన్ చేసుకునే భక్తులు 30 నుంచి 35 మంచి కలసి వస్తే ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తుంది. ముందస్తు రిజర్వేషన్ కావాలంటే మీకు సమీపంలో ఉన్న బస్టాండ్ వద్దకు వెళ్లి సంప్రదించవచ్చు.