Site icon HashtagU Telugu

AP Assembly Results : మరికాసేపట్లో ఏపీ ప్రజల తీర్పు ..

Ap Big Day

Ap Big Day

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చే సమయం రానేవచ్చింది. మరికాసేపట్లో రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాదించబోతుంది..? ఎవరు అధికారం దక్కించుకోబోతున్నారు..? ఎవరు సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు..? ఎవరికీ ఎంత మెజార్టీ రాబోతుంది..? ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది..? సైకిల్ జోరా…? ఫ్యాన్ గాలి స్పీడా..? అనేది తెలియబోతుంది.

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామాల్లో మహిళలు, పురుషులు, వృద్ధులే కాదు విదేశాల్లో ఉన్న NRI లు మండు ఎండలను సైతం లెక్క చేయకుండా వచ్చి ఓటు వేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా పోలింగ్ శాతం నమోదు అయింది. దీంతో పోలింగ్ శాతం పెరగడం ఏ పార్టీకి కలిసొస్తుందో అనే ఆసక్తి నెలకొంది.

రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సీట్ల కోసం 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఏపీలో మొత్తం 3.33 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించారు. 4.61 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు. 26,473 మంది ఓటర్లు హోమ్‌ ఓటింగ్‌ విధానం ద్వారా ఓటు వేశారు. మరో 26,721 మంది సర్వీసు ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటు వేయడం జరిగింది. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉదయం 8 గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌, 8.30 నుంచి ఈవీఎం ఓట్ల కౌంటింగ్ చేస్తారు. ఈసారి పోస్టల్‌ బ్యాలెట్లు ఎక్కువగా రావడం వల్ల.. వీటికి ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేసినట్లుగా ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఇక ప్రతి కౌంటింగ్ హాలులో ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగనుంది. ప్రతి టేబుల్ వద్ద అభ్యర్థులకు చెందిన ఏజెంట్లు ఉండనున్నారు. వారి ఎదుటే ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యను నమోదు చేయడం జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం 119 మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.

8.30 గంటలకు EVMల కౌంటింగ్ షురూ కానుంది. కొవ్వూరు, నరసాపురం స్థానాల్లో(MLA) తొలి ఫలితం వెలువడనుంది. భీమిలి, పాణ్యం ఫలితం చివరిగా రానుంది. రాజమండ్రి, నరసాపురం MP స్థానాల్లో తొలి ఫలితం రానుండగా.. అమలాపురం ఫలితం ఆలస్యం కానుంది. EVM కౌంటింగ్ కు ఒక్కో రౌండ్ కు 20-25 నిమిషాలు పట్టనుండగా మధ్యాహ్నం 1 కల్లా మెజార్టీ ఎవరిదో తేలనుంది. మరోపక్క ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 45,000 మంది పోలీస్ సిబ్బంది, 67 కంపెనీల సాయుధ బలగాలు భద్రతను పర్య వేక్షిస్తున్నాయి. సెంటర్ల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుంది. ఈవీఎంల తరలింపు నుంచి ఓట్ల లెక్కింపు వరకు మొత్తం వీడియో చిత్రీకరణ చేయనున్నారు.

Read Also : Skin Care : మీకు మొటిమల సమస్య ఉంటే, ఈ ఆహారాలకు దూరంగా ఉండండి