Lokesh: పేదల ఆకలి తీర్చిన పార్టీ తెలుగుదేశమేనని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్నది కూడా తెలుగుదేశం పార్టీయేనని, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కడపలో నిర్వహించిన మహానాడులో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన సేవలను గుర్తు చేస్తూ, భవిష్యత్తు దిశగా పార్టీ చేపట్టబోయే ఆరు కీలక శాసనాలను కూడా ప్రతిపాదించారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఇది రాజకీయ పార్టీ మాత్రమే కాదు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, అధికారం కూడా కొత్త కాదు. కానీ భవిష్యత్తు కోసం స్పష్టమైన దిశ అవసరం అని లోకేశ్ పేర్కొన్నారు.
భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం లోకేశ్ ప్రతిపాదించిన ఆరు శాసనాలు ఇవే:
1.తెలుగు జాతి విశ్వ ఖ్యాతి – ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ప్రతిభను వెలుగులోకి తేవడం.
2.యువగళం-యువతకు అవకాశాలు, నాయకత్వం కల్పించడం.
3.స్త్రీశక్తి -మహిళలకు సమాన హక్కులు, భద్రత మరియు సాధికారత.
4.పేదల కోసం సోషల్ రీఇంజినీరింగ్ – పేదల సేవలో సమర్థమైన విధానాలు.
5.అన్నదాతకు అండగా – రైతులకు న్యాయం, మద్దతు ధరలు మరియు వరద–ఎండ ప్రభావాల నుంచి రక్షణ.
6.కార్యకర్తలే అధినేత – ప్రతి కార్యకర్తకు గౌరవం, అవకాశాలు.
ఎత్తిన పసుపు జెండా దించకుండా నమ్మకంగా నిలిచిన కార్యకర్తలే పార్టీ బలమైన పునాది. ప్రతి కార్యకర్తకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన ముహూర్త బలం తేలిక కాదు. తెలుగు వారు ఎక్కడైనా ఇబ్బంది పడితే స్పందించేది మన పార్టీనే అని లోకేశ్ అన్నారు. మహానాడులో కీలక నిర్ణయాలు తీసుకుని, ప్రజలకు మరింత దగ్గరయ్యే మార్గాలు వెతకాలని, నేతలు, కార్యకర్తలు కష్టపడాలని లోకేశ్ పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతం తెలుగువారి ఆత్మగౌరవం. ఆత్మగౌరవాన్ని మనం ఎప్పటికప్పుడు నిలబెట్టాలి అని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Mahanadu : కడపలో ఈమహానాడు చరిత్ర సృష్టించనుంది: సీఎం చంద్రబాబు