Pulivendula politics : పులివెందులలో వైఎస్సార్‌సీపీకి షాక్ తగిలింది. వైఎస్ జగన్‌కు సన్నిహితులైన దంతులూరి కృష్ణ అనుచరుడు, మరికొన్ని కుటుంబాలు టీడీపీలో చేరారు. ఈ సభలో జగన్‌ను ‘కన్నడ బిడ్డ’ అంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పులివెందుల అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, శ్రీనివాసరెడ్డిలు జగన్‌ను విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపుపై దృష్టి సారించాము అన్నారు బీటెక్ రవి.
- పులివెందులలో వైసీపీకి ఎదురు దెబ్బ
- టీడీపీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలు
- టీడీపీలో చేరిన దేవర్ల చంద్రశేఖర్‌రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. జగన్‌కు అత్యంత సన్నిహితుడు దంతులూరి కృష్ణ ప్రధాన అనుచరుడు దేవర్ల చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీలో చేరారు. అలాగే వైఎస్సార్‌సీపీకి చెందిన చిన్నతాజ్ క్యాట్ గౌస్‌తో పాటు 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వేంపల్లెలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి.. వైఎస్సార్‌సీపీ నేతలకు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో పులివెందులలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.
జగన్ కడప బిడ్డగా కాకుండా కన్నడ బిడ్డగా మారిపోయారని మాజీ సీఎం జగన్‌పై రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోనే ఉంటూ, అధికారం పోగానే బెంగళూరు వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. అందుకే కన్నడ బిడ్డ అంటూ సెటైర్లు పేల్చారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో డబ్బు సంపాదించి, అధికారం కోల్పోయాక బెంగళూరులో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు.
పులివెందుల నియోజకవర్గాన్ని జగన్ గత ఐదేళ్లు సీఎంగా ఉన్న కాలంలో ఏ రంగంలోనూ అభివృద్ధి చేయలేదన్నారు శ్రీనివాసరెడ్డి. కాలేటి వాగు ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిందని.. దీనిని పూర్తి చేయడానికి నియోజకవర్గ ఇంఛార్జ్ బీటెక్ రవి చర్యలు చేపట్టారన్నారు. టీడీపీ వేంపల్లెలో నిర్వహించిన సభతో జగన్ గుండెల్లో దడ మొదలై ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలవాలంటే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో అన్నింటా గెలవాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ విధానాలను ఎండగట్టడంలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పనిచేయాలని.. అందరు కలిసి సమన్వయంతో ముందుకు సాగాలి అన్నారు.
