Site icon HashtagU Telugu

Sharmila : కాంగ్రెస్ చేతిలో షర్మిల అస్త్రం

Sharmila Is A Weapon In The Hands Of The Congress

Sharmila Is A Weapon In The Hands Of The Congress

By: డా. ప్రసాదమూర్తి

YS Sharmila, A weapon of the Congress Party : ఊహించని మలుపులు తిరిగేదే రాజకీయం. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని ఆనాడు ఎవరూ ఊహించ లేదు. అలాగే ఆయన ఏ పార్టీ కోసం అయితే జీవితాంతం కష్టపడి పని చేశారో ఆ పార్టీని ఆయన కుమారుడే విడిచిపెడతాడని ఎవరూ భావించలేదు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టి అంతటి ఘన విజయం సాధిస్తాడని అసలెవరూ అనుకోలేదు. ఇదంతా ఒక ఎత్తు. జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల (Sharmila) అతనికి ఎదురు తిరుగుతారని ఎవరూ కలలో కూడా అనుకోని ఉండరు. అనుకోనిది జరగడమే రాజకీయ చిత్రం.. విచిత్రం. వైయస్ షర్మిల (YS Sharmila) ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను విడిచి తెలంగాణలో వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసి వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి తన రాజకీయ అస్తిత్వాన్ని చాటుకోవాలని ఎంతగానో కష్టపడింది. అయితే ఆమెకు కనుచూపుమేరలో కూడా తన కష్టానికి ఫలితం దక్కే అవకాశాలు కనిపించలేదు. దానితో ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది.

We’re now on WhatsApp. Click to Join.

ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తెలంగాణ ఎన్నికల సమయంలో అంతా రంగం సిద్ధమైందని అందరూ భావించిన వేళ, సీట్ల సర్దుబాటు విషయంలో షర్మిల చేసిన డిమాండ్లు కాంగ్రెస్ అధిష్టానానికి నచ్చకపోవడంతో ఆమె పార్టీలో చేరిక తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే షర్మిల తెలివిగా తెలంగాణలో తన పార్టీ నుంచి ఏ అభ్యర్థినీ పోటీకి నిలిప లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి ఆమె పట్ల అభిమానం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. అయితే ఇప్పుడు షర్మిల భవిష్యత్తు ఏమిటి.. షర్మిలకు ఎంపీ సీటు ఇస్తారా.. లేక రాజ్యసభకు పంపిస్తారా అనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే, షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి ఆమె కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలే ఎక్కువగా ఇప్పుడు సాగుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైయస్ జగన్ తో సోదరి షర్మిల వైరి వర్గంలో చేరి పోరు సాగించబోతుందన్న మాట.

అందరూ అనుకుంటున్నట్టుగా వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీ తప్పకుండా ఆమెను ఆంధ్ర ప్రదేశ్లో తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఒక బలమైన అస్త్రంగా ప్రయోగించే అవకాశం ఉంది. ఆమెను ఆంధ్ర ప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలుగా చేయవచ్చని, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బాధ్యత పూర్తిగా ఆమెకు అప్పజెప్పవచ్చునని పలు రకాల కథనాలు మీడియాలో వస్తున్నాయి. వీటిని షర్మిల గాని కాంగ్రెస్ పార్టీ గాని ఖండించలేదు. అంతేకాదు షర్మిల నారా లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం తరఫున పంపించినట్టుగా ఆమె పేర్కొన్నారు. దానికి బదులుగా లోకేష్ నారావారి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేయడం కూడా ఒక పెద్ద వార్తగా వైరల్ అయింది. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం, అటు కర్ణాటకలో కూడా విజయం సాధించడం, దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టు ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిలను ఏపీలో రంగంలోకి దింపడానికి కాంగ్రెస్ యోచించడం నిజమేనని అందరూ భావిస్తున్నారు.

Also Read:  MLC Vamsi Krishna : రాజకీయాల్లోకి వచ్చి 60 ఎకరాలు అమ్ముకున్న – విశాఖ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ

ఇదే జరిగితే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోనే రణ రంగానికి నేపథ్యం సిద్ధమైనట్టు అర్థమవుతుంది. అంటే ఏపీలో అన్నాచెల్లెళ్ల మధ్య భీకర పోరాటానికి తెర లేవనుంది. ఎన్నికలలో పోటీ అంటే అది కేవలం రాజకీయాలకే పరిమితం కాదు. ఒకరిని ఒకరు దూషించుకోవడం, ద్వేషించుకోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఎన్నికల రాజకీయాలలో అతి సామాన్య విషయం. షర్మిల ఏపీలో రంగంలోకి దిగితే ఆమె ఎందుకు జగన్తో వైరం పెంచుకుందో ఆ కారణాలు బయటపడే అవకాశం ఉంది. వివేకా హత్య కేసుకు సంబంధించి షర్మిలకు చాలా సందేహాలు ఉన్నాయి. ఆమెకు చాలా విషయాలు తెలుసునన్న సంగతి అందరికీ అర్థమైంది. జగన్ కి షర్మిలకీ మధ్య ప్రత్యక్ష పోరాటం మొదలైతే రాజకీయాల మాటెలా ఉన్నా, వారి కుటుంబంలోని అతి రహస్యమైన విషయాలు కూడా బయటపడే అవకాశం ఉన్నట్టు పలువురు భావిస్తున్నారు. అంతేకాదు ఒకప్పుడు జగన్ కి వైయస్సార్ పై ఉన్న అభిమానంతో ప్రజలు ఓట్లు వేశారు. అదే వైయస్సార్ ముద్దుల కూతురు షర్మిల ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగితే ఆమె పట్ల కూడా ప్రజలు సానుభూతి ప్రదర్శించే అవకాశం ఉందా.. ఉంటే అది ఏ మేరకు ఉంటుంది.. సొంత ఇంట్లోనే మొదలైన ఈ పోరును జగన్ ఏ విధంగా పరిష్కరించుకుంటారు.. లేక రాజకీయంగా తన సోదరిని ఎదుర్కొనే శక్తితో నమ్మకంతో ఆయన ముందుకు పోతారా.. ఇలాంటి చాలా అంశాలు ఇంకా స్పష్టంగా తేలాల్సి ఉంది.

ఏది ఏమైనప్పటికీ వాతావరణం చూస్తుంటే అన్నాచెల్లెళ్ల మధ్య యుద్ధం తప్పదనేటటువంటి సంకేతాలు మాత్రమే అందుతున్నాయి. ఏపీ ప్రజల నుంచి జగన్ కు అందిన సానుభూతి అభిమానం, వైయస్సార్ కుటుంబం పట్ల ప్రజలు చూపించిన ప్రేమ అదే మోతాదులో షర్మిల పట్ల కూడా వ్యక్తం అవుతుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎవరి ప్రభావం ఎంత ఉంటుంది.. షర్మిలతో కాంగ్రెస్ కి ఎంత లాభం.. తెలుగుదేశం పార్టీకి ఎంత లాభం.. జగన్ కి ఎంత నష్టం అనేది ముందు ముందు చూడాలి.

Also Read:  TDP Win : టీడీపీ, జనసేన కూటమికి 115 సీట్లు.. సంచలన సర్వే నివేదిక