ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) రాష్ట్ర రాజకీయాల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుతో రాష్ట్ర హక్కులు తుడిచిపెట్టుకుపోతున్నా, రాష్ట్రంలోని ఏ ఒక్క ఎంపీ కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేదని ఆమె మండిపడ్డారు. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 45 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును 41 మీటర్లకు తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నా, దీనిపై ప్రతిపక్షాలు మౌనం వహించడం దారుణమని విమర్శించారు. “ఒక్క మగాడు కూడా కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నాడా?” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర రైతుల హక్కుల కోసం, నీటి పంపిణీలో తలెత్తుతున్న వివాదాలపై కాంగ్రెస్ పోరాటానికి సిద్ధంగా ఉందని షర్మిల చెప్పారు. బనకచర్ల స్లూయిస్ అంశాన్ని ప్రస్తావిస్తూ, అది కేవలం ప్రాంతీయ సమస్య మాత్రమే కాదని, రాష్ట్రవ్యాప్తంగా రైతుల హక్కులతో సంబంధముందని స్పష్టంచేశారు. “కాంగ్రెస్ ఒక మహాసముద్రం లాంటిది. పిల్ల కాలువలన్నీ చివరికి సముద్రంలో కలవాల్సిందే” అంటూ వైసీపీకి కూడా కాంగ్రెస్‌లో చేరే రోజు వస్తుందని సూచనీయంగా వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రధాని మోదీకి ఇచ్చే మద్దతుతోనే ఆయన కేంద్రంలో ధైర్యంగా వ్యవహరిస్తున్నారని షర్మిల ఆరోపించారు. విభజన హామీలు నెరవేర్చడం కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ బలపడాలన్నది ఆమె అభిప్రాయం. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విద్యుత్ నష్ట పరిహారం వంటి హామీలు నెరవేర్చాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనని ఆమె తేల్చిచెప్పారు.