Jagan Reddy: మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (Jagan Reddy) ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ తన రాజకీయ లబ్ధి కోసం ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించేలా నిస్సిగ్గు అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఇది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని వారు ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వంపై బురద జల్లడమే జగన్ రెడ్డి నైజమని, ఆయన పాలనలో రైతులు, ప్రజలు పడిన కష్టాలను మర్చిపోయి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని కూటమి నేతలు ధ్వజమెత్తారు.
ఆర్థిక విధానాలు – రైతులకు విషం
కూటమి నేతలు మాట్లాడుతూ.. జగన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం సమస్యలు సృష్టించడం అలవాటుగా మార్చుకున్నారని విమర్శించారు. నవరత్నాలు పేరుతో ప్రజలను, ముఖ్యంగా రైతులను నట్టేట ముంచిన జగన్, ఇప్పుడు తన విషపు మీడియా ద్వారా తానే రైతులకు అండగా ఉన్నట్టు అబద్ధాల వల విసురుతున్నారని మండిపడ్డారు. ధరలు లేవని లేనిపోని హడావుడి చేస్తూ, తన అనుచరులతో శాంతి భద్రతలను నిర్వీర్యం చేస్తూ అలజడులు సృష్టించడం జగన్ రెడ్డి నైజమని వారు ఆరోపించారు. గతంలో మిర్చి, పొగాకు, మామిడి, ఉల్లి ధరలపై నాటకమాడిన ఆయన.. ఇప్పుడు ఎరువులపై అబద్ధాల వర్షం కురిపిస్తున్నారని కూటమి నేతలు ఎద్దేవా చేశారు.
రైతులకు నష్టం, దోపిడీల ఘనత జగన్‌దే
రైతుల కష్టాలను నిజంగా పట్టించుకోవడం కాదని, ప్రభుత్వంపై బురద జల్లడమే జగన్ రాజకీయం అని కూటమి నేతలు స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో రైతులకు అండగా నిలబడితే, జగన్ రెడ్డి మాత్రం అబద్ధాల ప్రచారం చేస్తున్నారని వారు అన్నారు. గతంలో టీడీపీ హయాంలో రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని జగన్ రెడ్డి రైతులను మభ్యపెట్టారు కానీ చేసిందేమీ లేదని కూటమి నేతలు గుర్తు చేశారు.
చంద్రబాబు హయాంలో రైతులకు అండగా నిలిచిన టీడీపీ
చంద్రబాబు నాయుడు హయాంలో పంటలకు బీమా, సబ్సిడీ ఇచ్చి రైతులను ఎన్నో సందర్భాల్లో ఆదుకున్నారని కూటమి నేతలు గుర్తు చేసుకున్నారు. కానీ జగన్ రెడ్డి టీడీపీ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను రద్దు చేసి రైతులను మరింత ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. ఆర్.బి.కె.లు, పీ.ఎ.సీ.ల వ్యవస్థను కుప్పకూల్చి, ప్రైవేటు కంపెనీలకు అప్పగించి, ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి కోట్లు కాజేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందని వారు ఆరోపించారు.
ప్రకృతి వ్యవసాయం, మామిడి, ఉల్లికి మద్దతు ధర
“జగన్ రెడ్డి ప్రెస్ మీట్లలో నీతి, నమ్మకం అంటూ చెప్పేవి పచ్చి నాటకం మాత్రమే” అని కూటమి నేతలు అన్నారు. చంద్రబాబు ప్రకృతి సేద్యానికి నాంది పలికితే, జగన్ పాలనలో అది పడకేసిందని తెలిపారు. గత ఐదేళ్లలో మామిడి రైతులు నష్టపోతే ఒక్క రూపాయి కూడా సాయం అందించకుండా మొండి చేయి చూపారని, కానీ చంద్రబాబు హయాంలో కిలో మామిడికి రూ.4 సబ్సిడీ ఇచ్చి రైతులకు అండగా నిలిచారని వారు వివరించారు. ఉల్లిపాయల విషయంలో కూడా ధర పడిపోయినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి క్వింటా రూ.1200కి కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించిందని గుర్తు చేశారు.
Also Read: Sonia Gandhi: సోనియా గాంధీకి భారీ ఊరట.. పౌరసత్వం కేసు కొట్టివేత!
ఇన్‌పుట్ సబ్సిడీలో భారీ వ్యత్యాసం
గత టీడీపీ పాలనలో (2014-19) రూ.3,750 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి రైతు కష్టాన్ని తగ్గించిందని, కానీ జగన్ హయాంలో కేవలం రూ.1,977 కోట్లు మాత్రమే ఇచ్చారని కూటమి నేతలు గణాంకాలను ఉటంకించారు. డ్రిప్ ఇరిగేషన్‌కు 90% సబ్సిడీ ఇచ్చి నీటి సమస్యకు పరిష్కారం చూపిన చంద్రబాబు పథకాన్ని జగన్ రద్దు చేసి రైతులను ఇబ్బందులకు గురిచేశారని వారు ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కౌలు రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని, రూ.3,826 కోట్లు పంట రుణాలుగా మంజూరు చేసి లక్షలాది మంది రైతులకు ఊరట ఇచ్చిందని వారు పేర్కొన్నారు.