AP : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలోని సచివాలయంలో రాష్ట్ర ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన ‘ఫ్యామిలీ కార్డు’ మంజూరు చేయాలని ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్డు ఆధార్ కార్డు తరహాలో ఉండేలా రూపకల్పన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఫ్యామిలీ కార్డులో కుటుంబానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు సభ్యుల సమాచారం, ఆదాయ స్థాయి, ఆస్తులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి అంశాలు పొందుపర్చనున్నారు. దీనివల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు నిజంగా అవసరమున్న వారికి సులభంగా చేరే అవకాశం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.
వ్యవస్థలో పారదర్శకత, సమర్థత లక్ష్యం
ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం సమయానికి అందేలా డేటా ఆధారంగా పాలన సాగించాలి. క్షేత్రస్థాయిలో తగిన సమాచారం సేకరించి, అవసరాలను గుర్తించాలి. లబ్ధిదారులు తాము కోరినపుడు కాదు, అవసరమైన సమయంలోనే ప్రభుత్వం ముందుకొచ్చే విధంగా వ్యవస్థ ఉండాలి అని సీఎం చెప్పారు. ప్రస్తుతం కొన్ని పథకాల లబ్ధి కోసం కుటుంబాలు తమను తాము విడదీసుకుంటున్న దురదృష్టకర పరిస్థితిని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. పథకాల కోసం కుటుంబాలు విడిపోవడం సమాజానికి మంచిది కాదు. అందుకే సంక్షేమ పథకాలను మళ్లీ పునర్నిర్వచించాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పాలన సాగాలి అని ఆయన స్పష్టం చేశారు.
డేటా అప్డేటింగ్‌పై ప్రత్యేక దృష్టి
ఫ్యామిలీ కార్డ్ వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం కీలకమని సీఎం పేర్కొన్నారు. కుటుంబాల్లో కొత్త సభ్యులు చేరడం, ఆదాయ మార్పులు, వలసలు, మరణాలు వంటి అంశాలు నిరంతరం రికార్డవుతూ ఉండేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇలాంటి డేటా ఆధారంగా ప్రభుత్వ పరిపాలన మరింత సమర్థవంతంగా, లక్ష్యబద్ధంగా సాగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. ప్రజాసంఖ్య నియంత్రణ అనేది సమాజం ముందు నిలిచిన సవాల్. త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక పాపులేషన్ పాలసీ తీసుకురావాలని భావిస్తున్నాం. దీని పై విస్తృతంగా చర్చించి, సమగ్ర విధానాన్ని రూపొందిద్దాం అని చెప్పారు. రాష్ట్ర ప్రజల అవసరాలు మారుతున్న నేపథ్యంలో, ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను సమీక్షించి, అవసరమైతే వాటిని పునర్నిర్వచించాలని సీఎం సూచించారు. పథకాల రూపకల్పనలో సమగ్రత, సరళత, సమర్థత అనే మూడు ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో సంక్షేమ పరిపాలనలో పెద్ద మార్పుకు నాంది పలకేలా కనిపిస్తున్నాయి. డేటా ఆధారిత పాలన, సమగ్ర కుటుంబ కార్డు వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పారదర్శకత, వేగవంతమైన సేవలందింపు లక్ష్యంగా పనిచేయనుంది.
Read Also: IB Jobs : డిప్లొమా, డిగ్రీ అర్హతతో IBలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల