టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తలంపులు ఎదురయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని వర్మ తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరుగుతోన్న తరుణంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయ స్థానం కొట్టి పారేసింది. అరెస్టు పై ఆందోళన ఉంటే, బెయిల్ పిటిషన్ వేసుకోవాలని న్యాయస్థానం సూచించింది.
మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది కోర్టు ముందు అభ్యర్ధించారు. సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఇటువంటి అభ్యర్థనలు కోర్టు ముందు కన్నా పోలీసులతో చేయాలని న్యాయమూర్తి స్పష్టీకరించారు.