APSRTC: డీజిల్ రేటును బట్టి.. ఆర్టీసీ టిక్కెట్ రేట్లు!

తెలంగాణలో బస్ ఛార్జీలను పెంచడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచడానికి రంగం సిద్ధమైంది.

  • Written By:
  • Updated On - June 17, 2022 / 09:59 PM IST

తెలంగాణలో బస్ ఛార్జీలను పెంచడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచడానికి రంగం సిద్ధమైంది. తెలంగాణలో డీజిల్ సెస్ రూపంలో ఛార్జీలను పెంచేశారు. దీనివల్ల రూ.9 నుంచి రూ.170 వరకు ఛార్జీలు పెరిగాయి. ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసులతోపాటు అన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ డీజిల్ సెస్సు వడ్డనకు ప్రభుత్వం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. దీనిని నెలనెలా వడ్డిస్తే ఎలా ఉంటుందన్న దిశగాను ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఏపీలో ఏప్రిల్ నెలలో డీజిల్ సెస్ ను పెంచారు. దీనివల్ల ఆర్టీసీకి రూ.720 కోట్ల అదనపు ఆదాయం సమకూరినట్టే. మళ్లీ ఇప్పుడు డీజిల్ సెస్ అంటే..అది ప్రయాణికులకు మోయలేని భారమవుతుంది. అయినా సరే అధికారులు దీనిపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. డీజిల్ ధరలు ఎప్పుడు పెరిగితే అప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం కష్టం. దానికి బదులుగా మరో విధానానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది.

డీజిల్ ధరలు పెరగడం, తగ్గడాన్ని బట్టి నెలలో సగటు ధర ఎంత ఉందో ముందుగా చెక్ చేస్తారు. దానిని బేస్ చేసుకుని తరువాతి నెలలో ఆర్టీసీ ఛార్జీల్లో మార్పులు చేస్తారు. అంటే డీజిల్ రేటు పెరిగితే.. టిక్కెట్ రేటు పెరురుగుతుంది. అదే డీజిల్ ధర తగ్గితే టిక్కెట్ ధర తగ్గుతుంది. మరి దీనికి ప్రామాణికం ఉండాలి కదా అంటే.. హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ -హెచ్పీఐను ప్రామాణికంగా తీసుకుంటారు. ఆర్టీసీ ఛార్జీలను ఎప్పుడో ఓసారి పెంచడం కాకుండా.. డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులను బట్టి పెంచడం, తగ్గించడం చేస్తే ఏ సమస్యా ఉండదని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ చరిత్ర చూస్తే.. డీజిల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. అంటే ప్రతీ నెలా ఆర్టీసీ ఛార్జీలు కూడా పెరుగుతూనే ఉండే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ విషయంలో కేంద్రం ఇదే విధానాన్ని అమలు చేసింది.