Rs 400 Crore Scam: ‘‘లక్ష పెడితే 7 నెలలకే రెండు లక్షలు ఇస్తాం’’.. ‘‘కోటి పెడితే ఏడాదిలోనే రెండు కోట్లు ఇస్తాం’’ అంటూ జనాన్ని నమ్మించి కుచ్చుటోపీ పెట్టారు. ఈవిధంగా పిచ్చిపిచ్చి హామీలతో ప్రలోభ పెట్టి.. విజయవాడకు చెందిన నిడుమోలు వెంకట సత్య లక్ష్మి కిరణ్ ప్రజల నుంచి రూ.400 కోట్ల దాకా వసూలు చేశాడు. విజయవాడలోని సత్యనారాయణపురం కేంద్రంగా యు పిక్స్ క్రియేషన్స్ యానిమేషన్ పేరిట ఈ మోసానికి సత్య లక్ష్మి కిరణ్ తెరతీశాడు.
Also Read :Expensive Web Series: రూ.36 వేల కోట్లతో అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్.. విశేషాలివీ
సత్య లక్ష్మి కిరణ్ ఇలా నమ్మించాడు..
‘‘నేను సినిమాలకు యానిమేషన్ సాఫ్ట్‌వేర్ అందిస్తుంటాను. ఈ రంగంలో పెట్టుబడులు పెడితే వేగంగా లాభాలు వస్తాయి. పెట్టుబడి పెడితే వెంటనే రెండు రెట్లు డబ్బులు వస్తాయి’’ అని సత్య లక్ష్మి కిరణ్ నమ్మబలికాడు. అతడి మాటలను ప్రజలు నమ్మారు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, పల్నాడు జిల్లా నరసరావుపేటకు(Rs 400 Crore Scam) చెందిన పలువురు వ్యాపారులు, ఉద్యోగులు పెద్ద మొత్తంలో సత్య లక్ష్మి కిరణ్‌కు కోట్ల కొద్దీ డబ్బులు ఇచ్చారు. ‘‘నేను పెద్ద మొత్తంలో వడ్డీ ఇస్తున్నందున పత్రాలు పక్కాగా ఉండవు. ఆదాయపు పన్ను సమస్యలు వస్తాయి’’ అని సత్య లక్ష్మి కిరణ్ వారితో చెప్పేవాడు. ఈ మాటలు నిజమేనని నమ్మి.. గ్యారంటీ పత్రాలు లేకుండానే అతడి చేతిలో డబ్బులు పెట్టేవారు. కొందరు తెల్లకాగితంపై అమౌంట్ రాసి సంతకం పెట్టించుకునేవారు.
Also Read :Terror Plans Case : విజయనగరం ఉగ్ర కదలికలపై ఎన్ఐఏ దర్యాప్తు.. సిరాజ్ లింకులు వెలుగులోకి
ఏప్రిల్ నుంచి సత్య లక్ష్మి కిరణ్ మాయం
తనకు డబ్బులు ఇచ్చిన వాళ్లకు సత్య లక్ష్మి కిరణ్ మొదట్లో వడ్డీలు సక్రమంగానే ఇచ్చేవాడు. గత రెండేళ్లుగా డబ్బుల చెల్లింపులో జాప్యం చేస్తూ వచ్చాడు. ఈ రెండేళ్ల వ్యవధిలో మరింత మంది నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. అయితే వడ్డీల చెల్లింపులో జాప్యాన్ని కంటిన్యూ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సత్య లక్ష్మి కిరణ్ కనిపించకుండా పోయాడు. ఆఫీసు బంద్ చేశాడు. అతడి ఫోన్లు పనిచేయడం లేదు. ఇంట్లో వాళ్లు కూడా అందుబాటులో లేరు. దీనిపై నరసరావుపేటకు చెందిన బాధితుడు కె.దిలీప్‌కుమార్ విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నరసరావుపేటకు చెందిన టి. శ్రీనివాసరావు కూడా కిరణ్‌పై ఫిర్యాదు చేశాడు. గత ఏడేళ్లుగా విజయవాడలో యు పిక్స్ క్రియేషన్స్ యానిమేషన్ సంస్థను సత్య లక్ష్మి కిరణ్ నడుపుతున్నట్లు సమాచారం.
బ్లాక్ మనీ ఇచ్చిన వారు..
సత్య లక్ష్మి కిరణ్‌కు ఇద్దరు వ్యక్తులు రూ.15 కోట్లు చొప్పున ఇచ్చారు. మరో వ్యక్తి రూ.18 కోట్లు, ఇంకో వ్యక్తి రూ.12 కోట్లు ఇచ్చారు. ఇక కోటి నుంచి రూ.5 కోట్ల దాకా పదులసంఖ్యలో జనం ఇచ్చుకున్నారు. ఈవిషయాన్ని బయటికి చెప్పేందుకు చాలామంది జంకుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. వారి వద్ద సరైన ఆధారాలు కానీ, పత్రాలు కానీ లేవు. కొందరు ఇచ్చిన సొమ్ము బ్లాక్‌మనీ అని తెలుస్తోంది.
సత్య లక్ష్మి కిరణ్ దివాలా పిటిషన్‌లో ఏముంది ?
వారం క్రితం నిడుమోలు వెంకట సత్య లక్ష్మి కిరణ్ రంగారెడ్డి జిల్లా ఎల్‌బీ నగర్ కోర్టులో దివాలా పిటిషన్ వేశాడు. 2014లో యు పిక్స్ క్రియేషన్స్‌ను ఏర్పాటు చేసి రూ.155.95 కోట్ల పెట్టుబడులు సేకరించినట్లు అతడు ఐపీలో పేర్కొన్నాడు. 102 మంది బాధితుల జాబితాను కూడా కోర్టుకు సమర్పించాడు. రూ.2.72 కోట్లు మాత్రమే ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. రూ.400 కోట్లకుపైగా వసూలు చేసి, ఐపీలో రూ.155.95 కోట్లు మాత్రమే అతడు చూపుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.