ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ధవళేశ్వరం (Dowleswaram Barrage) మరియు శ్రీశైలం ప్రాజెక్టులకు ప్రభుత్వం మరమ్మత్తుల నిమిత్తం రూ.350 కోట్లు మంజూరు చేసింది. ముఖ్య కార్యదర్శి (CS) విజయానంద్ జీవో జారీ చేస్తూ ఈ నిధుల మంజూరును అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిధులు ద్వారా ప్రాజెక్టుల మరమ్మతులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉద్దేశం.
AP News : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు షాక్..
శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి అత్యవసరంగా మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికలో హెచ్చరించింది. ముఖ్యంగా వచ్చే ఆగస్టులోగా మరమ్మత్తులు పూర్తి చేయకపోతే ప్రాజెక్ట్‌కి ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉంది అని ఆ సంస్థ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా స్పందించి నిధులను విడుదల చేసింది. ఇది ప్రజల ప్రాణాలతో పాటు సాగునీరు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపించే అంశం కావడంతో ప్రభుత్వం అప్రతిహతంగా నిధులు విడుదల చేయడం కీలకంగా మారింది.
ధవళేశ్వరం బ్యారేజీకి చెందిన కొన్ని కీలక భాగాలు పాతకాలపు పద్ధతుల్లో ఉండటంతో వాటిని ఆధునిక సాంకేతికతతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ దశాబ్దాలుగా నైరుతి రుతుపవనాల సమయంలో అధిక నీటిని నిలుపుకుంటూ రాష్ట్రానికి కీలక సాగునీటి వనరుగా నిలుస్తోంది. అందువల్ల ఈ రెండు ప్రాజెక్టుల మరమ్మతులు పూర్తి చేయడం వల్ల ప్రజలకు నాణ్యమైన నీటి వనరులు అందుతాయి. రాష్ట్రంలో నీటి భద్రత, వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తికి మేలు జరిగేలా ఈ చర్యలు పటిష్టంగా కొనసాగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.