Roja Vs Lokesh: పొలిటికల్ హీట్.. డైమండ్ రోజా, లోకేష్ అంకుల్!

డైమండ్ పాప అని పిలవడంపై మంత్రి రోజా నారా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Lokesh And Roja

Lokesh And Roja

యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల మంత్రి రోజాను ఉద్దేశించి డైమండ్ పాప అని పిలవడంపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ నువ్వొక అంకుల్ అంటూ మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ తో కుమ్మక్కై జగన్ ను వేధించారని గుర్తుచేశారు. ఆ వేధింపులను లెక్కచేయకుండా జగన్ ఎంతో ఆత్మస్థైర్యంతో పాదయాత్ర ప్రారంభించి ప్రజల కష్టాలను తెలుసుకున్నారన్నారు.

పాదయాత్ర ద్వారా తెలుసుకున్న ప్రజల కష్టాలను అధికారంలోకి వచ్చిన తర్వాత జ‌గ‌న్‌ తీరుస్తున్నారన్నారు. అందుకే తమకు ఓటు వేయాలని ప్రజలను ధైర్యంగా అడుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని రోజా ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి రాష్ట్రానికి ఏం చేశారో, మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పకుండానే పప్పు నాయుడు పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలను దోచుకుని హైదరాబాద్ లో దాచుకున్నాడని, మళ్లీ ఆయనను సీఎం చేసేందుకు లోకేష్ ఆరాటపడుతున్నారన్నారు. చంద్రబాబు తనకు అవసరం ఉన్నప్పుడల్లా నందమూరి కుటుంబాన్ని వాడుకుంటారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోరన్నారు. అది నందమూరి కుటుంబం గుర్తించలేకపోతోందన్నారు. లోకేష్ పాదయాత్రలో సెక్యూరిటీ, వాలంటీర్లే ఎక్కువగా కనిపిస్తున్నారని, వాళ్ళు లేకపోతే కనీసం పదిమంది కూడా లోకేష్ పాదయాత్రలో కనిపించరని ఎద్దేవా చేశారు. లోకేష్ ది యువ గళం కాదని, ఒంటరిగళం అని అన్నారు. తనని డైమండ్ పాప అని లోకేష్ సంభోదించడంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లోకేష్ అంకుల్’ అంటూ పిలుస్తూ సెటైర్లు వేశారు.

  Last Updated: 01 Feb 2023, 05:59 PM IST