Robbin Sharma : రాబిన్ శర్మ.. ఏపీలో టీడీపీ విజయం వెనుక మాస్టర్‌మైండ్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి ప్రధాన కారణం.. ప్రభావవంతమైన ప్రచార వ్యూహం.

  • Written By:
  • Publish Date - June 12, 2024 / 11:13 AM IST

By Dinesh Akula

Robbin Sharma :  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి ప్రధాన కారణం.. ప్రభావవంతమైన ప్రచార వ్యూహం. ప్రచార వ్యూహం ఫలించబట్టే  రాష్ట్రంలోని 175 లోక్‌సభ స్థానాలకుగానూ 135 చోట్ల టీడీపీ విజయభేరి మోగించింది. ఈ ప్రచార వ్యూహాన్ని అందించిన ఓ మాస్టర్ మైండ్ గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఆయనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త  రాబిన్ శర్మ.  ఆయనతో ‘హ్యాష్ ట్యాగ్ యూ’ (HashtagU) ప్రత్యేక ఇంటర్వ్యూ వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

ఎవరీ రాబిన్ శర్మ ?

ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC).. దీన్ని సంక్షిప్తంగా ఐ-ప్యాక్ అని పిలుస్తారు. ఈసంస్థను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏర్పాటు చేశారు.అయితే ఇప్పుడు ఆయన అందులో పనిచేయడం లేదు. ఐ-ప్యాక్ సంస్థ ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఎన్నికల వ్యూహాలను అమలు చేసింది. రాబిన్ శర్మ గతంలో ఐ-ప్యాక్‌లోనే డైరెక్టర్ హోదాలో కీలక పాత్ర పోషించారు. తెర వెనుక నుంచి రాజకీయ సంప్రదింపులు జరపడంలో, ఎన్నికల వ్యూహాలను రచించి అమలు చేయడంలో ఆయన సిద్ధహస్తడు. I-PACలో తన నైపుణ్యాలను మెరుగుపర్చుకున్న  తర్వాత రాబిన్ శర్మ షోటైమ్ కన్సల్టెన్సీ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. 2019 ఎన్నికల్లో  వైఎస్సార్ సీపీ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి టీడీపీని పునరుద్ధరించే బాధ్యతలను రాబిన్ శర్మ(Robbin Sharma) సంస్థే నిర్వర్తించింది.

3 సూత్రాలతో విజయతీరాలకు..

ఈసారి ఎన్నికల ప్రచారంలో టీడీపీ మూడు కీలక అంశాలను బలంగా వినియోగించుకుంది.  మొదటిది..  బూత్ స్థాయి వరకు పార్టీ  శ్రేణులతో సమర్థవంతమైన డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. రెండోది.. తన ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడానికి జనసేన, బీజేపీలతో వ్యూహాత్మక కూటమిని ఏర్పాటు చేసుకుంది. మూడోది.. ఈ ఎన్నికలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఏపీ ప్రజలకు మధ్య జరుగుతున్నాయనే ప్రచారాన్ని బలంగా క్షేత్ర స్థాయికి తీసుకెళ్లింది. ఇవన్నీ అమలయ్యేలా చూడటంలో రాబిన్ శర్మ కీలక పాత్ర పోషించారు.  ఈ ప్రచారం ఫలించి ఎన్నికల్లో టీడీపీకి అద్భుతమైన ఫలితాలు వచ్చాయి.

Also Read :Terrorists Attack : కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడి.. ఆర్మీ బేస్‌పై కాల్పులు.. ఒకరు మృతి

HashtagU :  ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విజయానికి దోహదపడిన వ్యూహాలేంటి ?

రాబిన్ శర్మ (ఆర్ఎస్) :  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ఎన్నికలను ధనిక, పేద వర్గాల మధ్య పోరుగా మార్చారు. అది చాలా తప్పు. జగన్ ఎన్నడూ పేదరికాన్నిఅనుభవించలేదు. ఆయనకు పేదల బాధలు తెలియవు. అందుకే మేం జగన్ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాం. ‘జగన్ వర్సెస్ ఆంధ్ర‌ప్రదేశ్ ప్రజలు’ అనే దిశగా ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. మేం మా అన్ని కార్యక్రమాలు, ప్రచారాలకు ‘ప్రజా ’(ప్రజలు) అనే పదం వచ్చేలా పేర్లు పెట్టాం. ఫలితంగా ప్రజల దృష్టి టీడీపీ వైపు మళ్లింది.

HashtagU :  టీడీపీ ప్రచారం కోసం మీరు ఏర్పాటు చేసిన రెండు అంచెల వార్‌రూమ్‌ గురించి వివరిస్తారా? అది పార్టీ విజయానికి ఎలా ఉపయోగపడింది?

ఆర్‌ఎస్ :  తొలిసారిగా పెద్ద ఎత్తున రెండు అంచెల వార్ రూమ్‌ను మేం ఏర్పాటు చేశాం. ఇది సాంప్రదాయ టాప్ డౌన్ థింకింగ్ విధానాన్ని పూర్తి విరుద్ధమైనది.  ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన సెంట్రల్ కమాండ్ సెంటర్ (CCC) పరిధిలో వందలాది మంది ఫీల్డ్ వర్కర్లు పనిచేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ఆఫీస్ బేరర్‌లను సెంట్రల్ కమాండ్ సెంటర్ పరిధిలోకి చేర్చి..వారితో సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ నెట్‌వర్క్ ద్వారా ప్రజల వాస్తవిక సమస్యలను గురించి.. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌ వారీగా ఎన్నికల వ్యూహాలను అమలు చేశాం. స్వయంగా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులందరినీ సెంట్రల్ కమాండ్ సెంటర్‌తో కనెక్ట్ చేయించారు. సీసీసీ నుంచి వారికి పూర్తి మద్దతు లభిస్తుందని తెలిపారు. మేం 1,400 మందికి పైగా గ్రౌండ్ లెవల్ వర్కర్లతో, బూత్ లెవల్ వర్కర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. అభ్యర్థుల ప్రచార పంథాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం.

HashtagU : ఏ కార్యక్రమాలు లేదా వ్యూహాలు టీడీపీ ఓటు బ్యాంకును పెంచాయి ? ప్రచారంలో ముఖ్యమైన మలుపు ఏమిటి?

ఆర్‌ఎస్ :  ఈ ఎన్నికల ప్రచారంలో మూడు ప్రధాన అంశాలు ప్రభావవంతంగా పనిచేశాయి. వీటిలో మొదటిది సెప్టెంబరులో జరిగిన చంద్రబాబు నాయుడు అరెస్టు. ఇదే టీడీపీ ప్రచారానికి దిశానిర్దేశం చేసింది. మేం “నిజం గెలవాలి” అనే పేరుతో ప్రజలలోకి వెళ్లాం. చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. బాబు  సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మరణించిన ఇద్దరు పార్టీ సానుభూతిపరుల ఇళ్లను ఆమె సందర్శించి, వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపి, ఆర్థిక సహాయం అందించారు. దీంతో ప్రజల్లో చంద్రబాబుపై సానుభూతి పెరిగింది. జైలు నుంచి విడుదలైన తర్వాత చంద్రబాబు నాయుడు యాత్ర చేపట్టడం రెండో కీలక మలుపు. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య కూటమి కుదరడం మూడో ముఖ్య అంశం. దీంతో ఏపీలో అంతటా మూడు పార్టీల ఓటు బ్యాంకు ఏకీకృతం అయింది.

HashtagU : ఎన్నికల ప్రచారంలో మీకు ఎదురైన సవాళ్లు ఏమిటి ? వాటిని ఎలా అధిగమించారు ?

ఆర్‌ఎస్ :  ఎన్నికల్లో గెలవడమే తమ ఏకైక లక్ష్యమని చంద్రబాబు నాయుడు మాకు స్పష్టం చేశారు. ఎన్నికల వ్యూహాల అమలులో టీడీపీ క్యాడర్, నేతల వైపు నుంచి మాకు చాలా సహకారం లభించింది. ఎలాంటి ఇగో గొడవలు జరగలేదు. మొత్తం శ్రేణులన్నీ ఏకతాటిపై నిలబడి పనిచేయడం వల్లే ఈ విజయం వచ్చింది. జనసేన, బీజేపీ కూడా టీడీపీతో కలిసి పనిచేయడం ప్లస్ పాయింట్ అయింది.

HashtagU : ‘సూపర్ సిక్స్’ ప్రచారం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. సంక్షేమం, అభివృద్ధిపై ఏపీ ప్రజల ఆందోళనకు అది ఎలా పరిష్కారాన్ని చూపించింది ?

ఆర్‌ఎస్ :  సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కలిపి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని ఎన్నికల ప్రచారంలో  చంద్రబాబు పదేపదే చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కారణంగా మహిళల అత్యవసర పొదుపులు ఖర్చయిపోయాయి. నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోవడంతో ప్రజల జీవితాలు భారంగా మారాయి. వీటిని పరిష్కరించేందుకుగానూ మహిళల సాధికారత కోసం నెలకు రూ.1,500 ఆర్థిక సహాయాన్ని అందించాలని మేం ప్రతిపాదించాం. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికిగానూ మహా శక్తి ప్యాకేజీలో  భాగంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు, పిల్లలకు రూ. 15,000 అందించడం వంటి అంశాలను చేర్చాం. వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ ఫలాలు పొందిన ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారని మా సర్వేల్లో తేలింది. అందుకే మేం సంక్షేమం, అభివృద్ధి రెండూ అవసరమే అనే కోణంలో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాం.  ఇక చంద్రబాబు ప్రధాన యోగ్యతల గురించి ప్రజలకు తెలిపేలా..‘‘బాబు ని మళ్లీ రప్పిద్దాం’’ అనే నినాదంతో ముందుకు పోయాం.ఆయనలా అభివృద్ధి, సంక్షేమ పాలనను ఎవరూ అందించలేరనే ప్రచారం చేశాం.

HashtagU : జగన్ ప్రభుత్వ చర్యలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్న అంశాలను గుర్తించడంలో, వాటికి పరిష్కారాలను చూపించడంలో మీరు ఎలాంటి పాత్ర పోషించారు?

ఆర్ఎస్:  ‘‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’’  కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను వెలికితీసేందుకు ఇంటింటికి సర్వే నిర్వహించాం. తాగునీరు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, అభివృద్ధి సహా వివిధ వర్గాల నుంచి మేము 55 లక్షల సమస్యల వివరాలను సేకరించాం. వాటి ఆధారంగానే సూపర్ సిక్స్ ప్లాన్‌ని రూపొందించాం. వైఎస్సార్ సీపీ ఎన్నికల వాగ్దానాల్లో 99% నెరవేర్చిందా ? అని ప్రశ్నిస్తూ.. ప్రజల అభిప్రాయాలను సేకరించాం. ప్రజల  సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరిస్తూ  ఫామ్‌లను నింపి జగన్‌కు పంపాలనేది మా వ్యూహం. ప్రభుత్వం విఫలమైందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కూడా దీని లక్ష్యం.

HashtagU : మునుపటి ప్రచార కార్యక్రమాలతో పోలిస్తే.. ఏపీలో టీడీపీకి మీరు అందించిన వ్యూహరచన  ఎలా భిన్నమైంది ?

ఆర్ఎస్:  ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు మేం మేఘాలయలో పనిచేశాం. 2022లో ఆమ్ ఆద్మీ పార్టీతోనూ కలిసి పనిచేశాం. అక్కడ మేం నేరుగా ఎన్నికల టైంలో రంగంలోకి దిగాం. కానీ ఏపీలో చాలా ఏళ్లకు ముందు నుంచే పనిని మొదలుపెట్టాం. వ్యూహరచనకు వీలైనంత సమయం దొరికింది.  మేం 2022 నవంబర్‌లో ఏపీలో మా మొదటి ప్రచారాన్ని ప్రారంభించాం.

HashtagU :  ఏపీలో ఐప్యాక్‌ను షోటైమ్ కన్సల్టెన్సీ ఓడించిందని మనం చెప్పుకోవచ్చా ?

ఆర్ఎస్:  ఈ ఎన్నికలు చంద్రబాబు నాయుడు, టీడీపీ కూటమి విజయం. ఇది కేవలం ఐప్యాక్, షోటైమ్ కన్సల్టెన్సీల మధ్య పోటీ కాదు. నాకు ఐప్యాక్‌లోని పలువురితో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. నేను మొదట్లో అక్కడ పనిచేశాను. మా కన్సల్టెన్సీ దృష్టి విజయంపైనే ఉంది. దాన్ని సాధించాం.

Also Read : Hunter Biden Guilty : ఆ కేసులో బైడెన్ కుమారుడు దోషి.. అమెరికా ప్రెసిడెంట్ కీలక ప్రకటన