Brother Anil Kumar New Party : దేవుడున్నాడు బామ్మ‌ర్థి

బావ‌, బామ్మ‌ర్దుల మ‌ధ్య బెడిసింది. రాజ‌కీయంగా ఎవ‌రి కుంప‌టి వాళ్లు పెట్టుకోవాల‌ని డిసైడ్ అయిన‌ట్టు కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - March 8, 2022 / 01:58 PM IST

బావ‌, బామ్మ‌ర్దుల మ‌ధ్య బెడిసింది. రాజ‌కీయంగా ఎవ‌రి కుంప‌టి వాళ్లు పెట్టుకోవాల‌ని డిసైడ్ అయిన‌ట్టు కనిపిస్తోంది. అక‌స్మాత్తుగా వైఎస్ కుటుంబంలో వ‌చ్చిన విభేదాలు తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయాన్ని తాకాయి. వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన ష‌ర్మిల `రాజ‌న్న‌రాజ్యం` తెలంగాణ‌కు అవ‌స‌ర‌మ‌ని భావిస్తోంది. ఏపీలో జ‌గ‌న‌న్న రాజ్యంపై ప్ర‌శ్నిస్తే..దాట‌వేస్తోంది. తొలి రోజుల్లో మాత్రం ఏపీలో రాజ‌న్న‌రాజ్యం కోసం జ‌గ‌న‌న్న ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని చెప్పేది. ఇప్పుడే ఏపీ మాట ఎత్తితే షర్మిల సైడ్ అవుతోంది. ఓన్లీ తెలంగాణ గురించి ప్ర‌శ్నించండంటూ విలేక‌రుల‌కు ష‌ర్మిల మీడియా స‌మావేశంలో హుకుం జారీ చేస్తోంది.బ్ర‌ద‌ర్ అనిల్ మాత్రం చాప‌కింద‌నీరులా ఏపీలో రాజ‌కీయ క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. రాజ‌కీయాల‌కు దూరం అంటూనే జూలు విదిలిస్తున్నాడు. ఏపీలోని 13 జిల్లాల క్రిస్టియన్, బీసీ, మైనారిటీ సంఘాల నేతలతో అనిల్ సోమ‌వారం నిర్వ‌హించిన స‌మావేశం సీరియ‌స్ పాలిటిక్స్ కు ద‌గ్గ‌ర‌గా ఉంది. కొత్త పార్టీ గురించి ఆయా ప్రాంతంల్లోని ప్రజలకు చెప్పి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని సూచించార‌ట‌. ఆ మీటింగ్‌లో పాల్గొన్న వాళ్లు షర్మిలకు మద్దతు ప్రకటిస్తున్నట్ల ప్రచారం సాగుతోంది. ఏపీ సీఎం జ‌గ‌న్ వాల‌కంపై బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ నాయకులు బ్ర‌ద‌ర్ అనిల్ ఎదుట ఏక‌రవు పెట్టార‌ని తెలిసింది. ఈ నెలలోనే పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేద్దామని బ్ర‌ద‌ర్ సూచాయ‌గా చెప్పాడ‌ట‌.

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి కేసీఆర్ స‌ర్కార్ పై పోరాటం చేస్తోన్న షర్మిల ఏపీలోనూ పార్టీ పెడుతున్నారా? అనే చర్చ ఇటీవ‌ల జ‌రిగింది. రాజకీయ పార్టీ అన్నది ఎవరైనా.. ? ఎక్కడైనా పెట్టవచ్చు అంటూ విలేక‌రుల స‌మావేశంలో ఆ మ‌ధ్య చెప్పిన‌ప్పుడే ఆమె ఆంత‌ర్యం బ‌య‌ట‌ప‌డింది. ఏపీలో పార్టీ పెడితే ఏమైనా తప్పా అని ఎదురు ప్రశ్నించిన‌ప్పుడే అనుమానం క‌లిగింది. ఆంధ్రప్రదేశ్‌లో తాను రాజకీయ పార్టీ పెట్టకూడదని ఎక్కడా రూల్ లేదంటూ ఆమె విలేక‌రుల‌ను ప్ర‌శ్నించిన‌ప్పుడే అంత‌రార్థం చెప్పేసింది. భవిష్యత్తు లో పార్టీ పెట్టే యోచన వుందని పరోక్ష సంకేతాలు అందించారు వైఎస్‌ షర్మిల. అందుకు బ‌లం చేకూరేలా ఇప్పుడు ఏపీలోనూ పార్టీ పెట్టే దిశగా వైఎస్‌ షర్మిల అడుగులు వేస్తున్నట్టుగా బ్ర‌ద‌ర్ అనిల్ సోమ‌వారం నిర్వ‌హించిన మీటింగ్ నిరూపిస్తోంది.వైఎస్ కుటుంబంలోని విభేదాల క్ర‌మంలో కొత్త పార్టీ తెలంగాణ‌లో వ‌చ్చింది. ఏపీలోనూ రాబోతుంద‌ని బ్ర‌ద‌ర్ అనిల్ సంకేతాలు ఇచ్చేశాడు. జగ‌న‌న్న వ‌దిలిన బాణంగా ష‌ర్మిల కు గుర్తింపు ఉంది. ఓదార్పు యాత్రను కొన‌సాగించిన రాజ‌కీయ వార‌సురాలిగా ఆనాడు గుర్తింపు పొందింది. జైలుకు జ‌గ‌న్ వెళ్లిన‌ప్పుడు పాద‌యాత్ర‌ను కొన‌సాగించిన ష‌ర్మిల వైసీపీకి అండ‌గా నిలిచింది. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ ఆలోచ‌న మారింది. ఆస్తుల విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్యా విభేదాలు ఏర్ప‌డ్డాయ‌ని ఇడుపుల‌పాయ‌, లోట‌స్ పాండ్ వ‌ర్గాల వినికిడి. ఇటీవల జ‌రిగిన వైఎస్ జ‌యంతి వేడుక‌ల్లోనూ జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య ఇడుపుల‌పాయ కేంద్రంగా పెద్ద రాద్దాంతం జ‌రిగిందని వైఎస్ కుటుంబానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న వాళ్లు చెప్పుకుంటోన్న మాటలు. బామ్మ‌ర్దుల మ‌ధ్య వ‌చ్చిన విభేదాల న‌డుమ విజ‌య‌మ్మ కూడా ఏమీ చేయ‌లేక పోతుంద‌ట‌. ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ రాజ‌కీయ వార‌సురాలిగా ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి తాడేప‌ల్లి కేంద్రంగా ఫోక‌స్ అవుతోంది. స‌రిగ్గా ఈ పాయింట్ వ‌ద్దే ష‌ర్మిల‌, జ‌గ‌న్ మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని కొంద‌రి టాక్‌. రాజ్య‌స‌భ ఇవ్వ‌లేద‌ని ష‌ర్మిల ఏపీ సీఎం జ‌గ‌న్ మీద అలిగింద‌ని మ‌రికొంద‌రిలోని గుస‌గుస‌లు. కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ జ‌గ‌న్ ల‌క్ష్యంగా బ్ర‌ద‌ర్ అనిల్ దంప‌తులు కొత్త పార్టీ దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ట‌. ఇది కేవ‌లం మీడియా ఫోక‌స్ వ‌ర‌కే ప‌రిమిత‌మా? నిజమా ? అనేది ప్ర‌స్తుతానికి సందిగ్ధం. న్యాయ‌బ‌ద్ధ ఆస్తుల కోసం జ‌గ‌న్‌ కు జ‌ర్క్ ఇవ్వ‌డానికి కొత్త పార్టీ అంటూ ఫోక‌స్ చేస్తున్నార‌ని కొంద‌రి భావ‌న‌. మొత్తానికి ఏపీలో కొత్త‌పార్టీ వైఎస్ ఫ్యామిలోనే కాదు, జ‌నంలోనూ హాట్ టాపిక్ గా మారింది.