Minister Lokesh : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత, పునరుత్పాదక ఇంధన రంగం మరింత వేగం పెంచుకుంది. గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ (ICE Policy) ఫలితంగా, రాష్ట్రం దిశగా భారీ పెట్టుబడులు ప్రవహించాయి. ఈ నేపథ్యంలో, అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని బేతపల్లిలో రూ. 22వేల కోట్లతో భారత్‌లోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను రెన్యూ పవర్ సంస్థ ప్రారంభించనుంది. ఈ నెల 16న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ మేగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు తొలి దశలో 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ సామర్థ్యంతో రూ. 7వేల కోట్ల పెట్టుబడి జరగనుంది. అనంతరం మొత్తం 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ సామర్థ్యంతో ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు.
Read Also: BJP : వైసీపీ నుంచి బీజేపీలో చేరిన జకియా ఖానం
ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అతిపెద్ద పెట్టుబడులలో ఒకటిగా నిలవనుండగా, రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగనుంది. గతంలో రెన్యూ సంస్థ 2019 వరకు ఏపీలో 777 మెగావాట్ల సామర్థ్యంతో ప్రధాన పాత్రధారిగా నిలిచింది. అయితే, తరువాతి ప్రభుత్వం సమయంలో పెట్టుబడులు నిలిపివేసిన రెన్యూ, దావోస్‌లో జరిగిన వ్యూహాత్మక చర్చల నేపథ్యంలో మళ్లీ ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పారదర్శక విధానాలు, ఫాస్ట్-ట్రాక్ అనుమతులు, పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు, పరిశ్రమలకు అనుకూల వాతావరణం వంటి అంశాలు రెన్యూవబుల్ రంగంలో మళ్లీ విశ్వాసాన్ని కలిగించాయి. మంత్రి లోకేశ్ దావోస్ వేదికగా రెన్యూ పవర్ ఛైర్మన్ సుమంత్ సిన్హాతో జరిగిన చర్చలే దీనికి బలమయ్యాయి.
ఇదే సమయంలో రాష్ట్రం మొత్తంలో రూ. 65వేల కోట్లతో 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు రాగా, కనిగిరిలో తొలి ప్లాంట్‌కు మంత్రి లోకేశ్ భూమిపూజ చేశారు. టాటా పవర్ (రూ.49వేల కోట్లు), ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు (రూ.1.86 లక్షల కోట్లు), వేదాంత సెరెంటికా (రూ.50వేల కోట్లు), ఎస్ఎఈఎల్ ఇండస్ట్రీస్, బ్రూక్ ఫీల్డ్ వంటి ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. రాబోయే ఐదేళ్లలో 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను రాష్ట్రానికి ఆకర్షించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే మోడల్‌గా నిలవబోతోంది.