ఏపీలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు సమాచార హక్కు చట్టం- 2005 పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నంకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదుపై విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చారు. ఆలయాలు, చర్చిలు, మసీదుల పరిపాలనా వివరాలు సమాచార చట్టం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలు, మసీదులు, చర్చిలు సమాచార హక్కు చట్టం పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నిర్వహించేవి ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) వజ్జా శ్రీనివాసరావు తెలిపారు. ఈ చట్టం కింద ఎవరైనా సమాచారం అడిగితే ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని.. ఈ సంస్థలు ఆర్టీఐ చట్టానికి లోబడి అడిగిన సమాచారాన్ని అందజేయాలని వెల్లడించారు. ఆలయాల్లో అర్చకులు, చర్చిల్లో పాస్టర్లకు, మసీదుల్లో ఇమామ్, మౌజమ్‌లకు గౌరవ వేతనం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక దేవాదాయ శాఖ ఉద్యోగులు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారు. అందుకే ఈ సంస్థలు ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని కమిషన్ తేల్చి చెప్పింది. మత విశ్వాసాలు, వ్యక్తిగత ఆచారాలు, వేడుకల వంటి అంశాలకు సంబంధించిన విషయాలు ఆర్టీఐ పరిధిలోకి రావని క్లారిటీ ఇచ్చారు.
2013లో విశాఖపట్నం శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించిన సమాచారాన్ని పట్నాయక్ అనే వ్యక్తి కోరారు. అయితే తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వలేదని ఆలయ పీఐవోపై సీఐసీ (రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్)కు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్‌పై సీఐసీ విచారణ జరపగా.. మహాలక్ష్మి ఆలయం నుంచి డిప్యూటీ కమిషనర్, ఫిర్యాదు చేసిన పట్నాయక్ హాజరయ్యారు. ఇరువురు ఈ అంశంపై వాదనలు వినిపించారు. తాను ఆలయంలో పండుగలకు సంబంధించి సమాచారం కోరానని.. ఆర్టీఐ చట్ట ప్రకారం 21 దరఖాస్తులు చేసినట్లు పట్నాయక్ తెలిపారు. అయినా సరే పీఐవో నుంచి బదులు ఇవ్వకుండా దరఖాస్తుల్ని తిరస్కరించారన్నారు. తాను చేసిన దరఖాస్తుల్ని ఆర్టీఐ చట్టంలోని ఏ నిబంధన కింద తిరస్కరించారో చెప్పలేదని పట్నాయక్ తన వాదనల్ని వినిపించారు.
2018లో హైకోర్టు ఓ తీర్పు ఇచ్చిందని ఆలయ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఆలయాలు ఆర్టీఐ పరిధిలోకి రావని తీర్పు ఇచ్చింది కాబట్టి తాము సమాచారం ఇవ్వలేదన్నారు. హైకోర్టు మళ్లీ ఉత్తర్వులు ఇచ్చే వరకు సమాచారం ఇవ్వలేమన్నారు. అయితే ఈ అంశంపై ఇతర రాష్ట్రాల్లో హైకోర్టులు ఇచ్చిన తీర్పుల్ని పరిశీలించి సీఐసీ పట్నాయక్ కోరిన సమాచారాన్ని 15 రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించారు. సమాచార హక్కు చట్టం-2005 పరిధిలోకి ఆలయాలు, మసీదులు, చర్చిలు వస్తాయని తేల్చి చెప్పారు.
