TDP : టీడీపీకి రెబ‌ల్స్ గండం.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో బ‌రిలోకి దిగుతున్న అసంతృప్తి నేత‌లు

  • Written By:
  • Publish Date - March 6, 2024 / 08:03 AM IST

తెలుగుదేశం పార్టీలో నాలుగున్న‌రేళ్లు క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన వారిని అధిష్టానం చాలాచోట్ల ప‌క్క‌న పెడుతుంది. సామాజిక ఆర్థిక స‌మీక‌ర‌ణాల్లో భాగంగా వారికి టికెట్లు నిరాక‌రిస్తుంది. జ‌న‌సేన టీడీపీ ఉమ్మ‌డి జాబితాలో 99 మంది అభ్య‌ర్థుల పేర్లు బ‌య‌టికి వ‌చ్చాయి. అయితే రెండ‌వ జాబితాలో చాలా చోట్ల మార్పులు ఉంటాయ‌ని అందుకే జాబితా విడుద‌ల కాస్త ఆల‌స్యమ‌వుతుంద‌ని క్యాడ‌ర్‌లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్ప‌టికే టికెట్ ఆశావాహులు అంతా అధిష్టానం వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు. పొత్తులో భాగంగా కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు టీడీపీ కోల్పోతుండ‌టంతో ఆ నియోజ‌క‌వ‌ర్గాల ఇంఛార్జ్‌ల‌తో అధిష్టానం మాట్లాడుతుంది. జ‌న‌సేన పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ పూర్తిగా స‌హ‌కరించాల‌ని వారికి అధిష్టానం సూచిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో టీడీపీకి రెబ‌ల్స్ గండం మొద‌లైంది. నూజివీడు, మైల‌వ‌రం, తిరువూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఇంఛార్జ్‌ల‌ను కాద‌ని కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించ‌డంతో వారంతా పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. త‌మ‌ను కాద‌ని వేరే వారికి టికెట్ ఇవ్వ‌డంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నూజివీడులో టీడీపీ ఇంఛార్జ్‌గా మొన్న‌టి వ‌ర‌కు ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు ఉన్నారు. అయితే ఆయన స్థానంలో ఇటీవ‌ల వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన పెన‌మ‌లూరు ఎమ్మెల్యే పార్థ‌సార‌థిని నూజివీడు ఇంఛార్జ్‌గా ప్ర‌క‌టించ‌డంతో ముద్ద‌ర‌బోయిన పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లిన ముద్ద‌ర‌బోయిన అక్కడ కూడా టికెట్‌పై హామీ రాక‌పోవ‌డంతో సైలెంట్‌గా ఉన్నారు. అయితే త‌న వ‌ర్గంవారితో స‌మావేశమైన ముద్ద‌ర‌బోయిన స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నారు.

Also Read:  AP Special Status: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమే: ఏపీ బీజేపీ

గ‌తంలో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన ముద్ద‌ర‌బోయిన మ‌రోసారి నూజివీడు నుంచి ఇండిపెండెంట్‌గా బ‌రిలోకి దిగేంద‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. దీంతో ఇక్క‌డ టీడీపీకి ఇబ్బందిక‌రంగా మారుతుంది. టీడీపీ ఓట్లు చీలి వైసీపీ గెలిచే అవ‌కాశం ఉంద‌ని క్యాడ‌ర్‌లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇటు మైల‌వ‌రం నియెజ‌కవ‌ర్గంలో కూడా టికెట్ ఆశిస్తున్న బొమ్మ‌సాని సుబ్బారావు కూడా టికెట్ రాక‌పోవ‌తే రెబ‌ల్‌గా బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. వైసీపీ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్రసాద్‌కు టీడీపీ టికెట్ దాదాపుగా ఖ‌రారైంది. ఇంఛార్జ్‌గా ఉన్న దేవినేని ఉమా, జిల్లా ఉపాధ్య‌క్షుడు బొమ్మ‌సాని టికెట్ కోసం ఇంకా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. బొమ్మ‌సాని రెబ‌ల్‌గా పోటీ చేస్తే ఇక్క‌డ కూడా టీడీపీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి. మ‌రి ఈ రెబల్స్‌ని టీడీపీ ఏ విధంగా డీల్ చేస్తుందో వేచి చూడాలి,