Hanuma Vihari : ఏపీలో కాకరేపుతున్న హనుమ విహారి కెఫ్టెన్సీ తొలగింపు..

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 02:12 PM IST

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు (AP Politics ) ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీలు ఏ అంశాన్ని వదిలిపెట్టడం లేదు. ఏది దొరికిన దానిపై రచ్చ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ఫై ప్రతిపక్ష పార్టీలు డేగకన్ను తో ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రతిదాంట్లో ప్రతిపక్షపార్టీలకు దొరికిపోతుంది. నిన్నటికి నిన్న ఆర్కే బీచ్లో ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడం ఫై ప్రతిపక్ష పార్టీలు గట్టిగానే ప్రభుత్వాన్ని విమర్శించాయి. ప్రారంభించిన మరుసటి రోజే తెగిపోయిందని..వైసీపీ పాలన ఆలా ఉంటుంది మరి అంటూ సెటైర్లు పేల్చారు.

ఇక ఈరోజు ఆంధ్రా రంజీ జట్టుకు కెప్టెన్‌గా హనుమ విహారి (Hanuma Vihari) తొలగింపుఫై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. క్రీడల పట్ల వైసీపీ (YCP) అనుసరిస్తున్న తీరుపై ముప్పేట దాడి తీవ్రమవుతోంది. తమ పార్టీలోని ఓ నేత కోసం జాతీయ ఆటగాడ్ని ఇబ్బంది పెట్టడం, అధికార పార్టీ అహంకారానికి పరాకాష్ట అంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. టీమిండియా బ్యాటర్ , ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి ఆంధ్ర క్రికెట్ జట్టును వీడనున్నట్లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2023- 2024 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి ఆంధ్ర జట్టు నిష్క్రమించిన అనంతరం హనుమ విహారి తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని, ఇకపై ఆంధ్ర జట్టు కోసం ఆడబోనని ఆయన పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఒక రాజకీయ నేత ఒత్తిడితో తన తప్పు ఏమీ లేకున్నప్పటికీ తనను కెప్టెన్ నుంచి వైదొలగమన్నారు అని అసలు విషయం చెప్పిన హనుమ విహారి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఏపీ క్రికెట్ అసోసియేషన్ కారణంగా తాను ఎంతో బాధపడ్డాను అని తన ఆత్మ గౌరవం దెబ్బతిందన్నారు. హనుమ విహారి నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయాలపై టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు.

వైసీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటు. హనుమవిహారి ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్. అతను ఆంధ్రప్రదేశ్ తరపున ఎన్నటికీ ఆడనని ప్రమాణం చేసే స్థాయికి టార్గెట్ చేశారు. హనుమ మీరు దృఢంగా ఉండండి. ఆట పట్ల మీ చిత్తశుద్ధి, నిబద్ధత వెలకట్టలేనిది. ఇలాంటి చర్యలు ఆంధ్రప్రదేశ్ లేదా మన ప్రజల నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించవు. మేము మీకు అండగా ఉంటాము.. మీకు న్యాయం జరిగేలా చూస్తాము.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందిస్తూ..ఆంధ్రా క్రికెట్ టీమ్ కెప్టెన్ విహారిని అవమానించి ‘అడుదాం ఆంధ్రా’ లాంటి ఈవెంట్లకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం ఎందుకని సీఎం జగన్ను పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘వైసీపీ నేత జోక్యంతో ఆంధ్రా క్రికెట్ నుంచి విహారి నిష్క్రమణ ఆశ్చర్యం కలిగించింది. విహారీ, మీరు ఛాంపియన్ ప్లేయర్. మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. కొత్త ప్రభుత్వంలో వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్రా తరఫున ఆడతారని ఆశిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

హనుమ విహారి అంశంలో ఆంధ్రా క్రికెట్​ అసోసియేషన్​ తీరును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ (Nara Lokesh) ఖండించారు. అధికార పార్టీ రాజకీయ జోక్యంతో ఆంధ్రా క్రికెట్ నుంచి ప్రముఖ క్రికెటర్ హనుమవిహారి చేదు నిష్క్రమణ ఆశ్చర్యం కలిగిస్తోందని లోకేష్​ అన్నారు. రెండు నెలల్లోనే ఏపీ తరపున తిరిగి ఆడటానికి రావాలని హనుమవిహారిని ఆయన కోరారు. తాము హనుమ విహారి, అతని జట్టుకు రెడ్ కార్పెట్ ద్వారా స్వాగతం పలుకుతామని తెలిపారు. ఆంధ్రా క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీని గెలవడానికి అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తామని లోకేష్​ హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) దీనిపై స్పందిస్తూ.. క్రీడలపైనా వైసీపీ దౌర్భాగ్య రాజకీయాలా అంటూ ఆమె మండిపడ్డారు. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేముంటుందంటూ విమర్శలు గుప్పించారు. అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్నారని, రాష్ట్ర ప్రతిష్ఠను అన్నివిధాలా నాశనం చేశారని అన్నారు. ఆడుదాం ఆంధ్ర అంటూ 2 నెలలు సినిమా స్టంట్స్‌ చేశారని షర్మిల దుయ్యబట్టారు. ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా అంటూ ప్రశ్నించారు. అది ఆంధ్రా క్రికెట్ అసోసియేషనా, అధ్వానపు క్రికెట్ అస్సోసియేషనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిస్పాక్షిక విచారణ జరగాలని ఆమె డిమాండ్​ చేశారు. ఇంకెన్ని దిగజారుడు ఆటలు ఆడతారు వీళ్లు అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటె హనుమ విహారి ప్రకటన ఫై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) స్పందించింది. “ఈ వివాదంపై స్పందించాలని భావించాం. బెంగాల్ తో రంజీ మ్యాచ్ సందర్భంగా మిస్టర్ విహారి ఓ ప్లేయర్ ను అందరి ముందు వ్యక్తిగతంగా దూషించినట్లు మా దృష్టికి వచ్చింది. బాధిత ప్లేయర్ అధికారికంగా ఫిర్యాదు చేశాడు. జనవరి 2024లో ఆ రంజీ ట్రోఫీ మ్యాచ్ తర్వాత సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ నుంచి ఓ మెయిల్ వచ్చింది. విహారి ఇండియన్ టీమ్ కు ఆడే అవకాశాల వల్ల సీజన్ మొత్తం అందుబాటులో ఉండటంపై సందేహాలు ఉన్న నేపథ్యంలో కొత్త కెప్టెన్ ను ప్రతిపాదించారు. విహారి కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించాడు. దీంతో రిక్కీ భుయిని కొత్త కెప్టెన్ గా సీనియర్ సెలక్షన్ కమిటీ నియమించింది” అని ఏసీఏ స్పష్టం చేసింది.

అలాగే విహారిపైనా ఆరోపణలు గుప్పించింది. విహారి బూతులు తిడతాడని, అతని తీరు దారుణంగా ఉందని టీమ్మేట్స్, సపోర్ట్ స్టాఫ్, ఏసీఏ అడ్మినిస్ట్రేటర్ల నుంచి కూడా ఫిర్యాదులు అందినట్లు ఏసీఏ పేర్కొంది. ఇతర రాష్ట్ర జట్లకు ఆడటం కోసం విహారి తరచూ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ అడుగుతాడని, ఆ వెంటనే మనసు మార్చుకుంటాడని కూడా ఆరోపించింది. మరి ఈ ఆరోపణలు, విమర్శలపై విహారి ఎలా స్పందిస్తాడో చూడాలి.

Read Also : Health Benefits Raisins: ఎండు ద్రాక్షను ఈ విధంగా తీసుకుంటే చాలు.. అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం?