Raghuramakrishna Raja : ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు రఘురామ పేరును ప్రకటించారు. అయితే ఈ పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇక ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా తన పేరు ఖరారు కావడంతో రఘురామకృష్ణరాజు బుధవారం అసెంబ్లీలో సందడి చేశారు. ఆయనకు కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అభినందనలు తెలిపారు.
కాగా, డిప్యూటీ స్పీకర్ పదవికి కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పేరును మంగళవారం రాత్రి సీఎం చంద్రబాబు ఖరారు చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ పదవికి రఘురామ పేరును ప్రతిపాదిస్తూ టీడీపీ తరఫున మంత్రి లోకేశ్, జనసేన తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు సంతకాలు చేశారు. ఈ కాపీలతో కూడిన మూడు సెట్ల నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరకు సాయంత్రం 4.30 గంటలకు రఘురామకృష్ణరాజు అందించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ గడువు ముగిసేవరకి.. రఘురామ తప్ప మరెవ్వరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది.
కాగా, రఘురామకృష్ణరాజు 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఇక రచ్చబండ పేరుతో రఘురామకృష్ణరాజు ఎప్పటికప్పుడు.. అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. దీంతో ఆగ్రహించిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి, కస్టడీలో చిత్రహింసలు పెట్టింది. 2024 ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు ఉండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.