వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రాహుల్ మద్దతు

త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారని, ఉక్కు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వైజాగ్ ను సందర్శిస్తారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు.

  • Written By:
  • Updated On - October 7, 2021 / 02:10 PM IST

త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారని, ఉక్కు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వైజాగ్ ను సందర్శిస్తారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కు రాహుల్ గాంధీ ఇప్పటికే తన మద్దతును అందించారని ఆయన అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రైవేట్ కంపెనీలను జాతీయం చేశారని, కానీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వాటిని కార్పొరేట్ కంపెనీలకు విక్రయిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేం ఉక్కు కర్మాగారాన్ని నిర్వహిస్తామని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యతిరేకించే స్థితిలో లేదని ఆయన ఆరోపించారు.

రాష్ర్ట సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఒకవైపు నిధులు మంజూరు చేస్తుంటే.. మరోవైపు జగన్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటుందని విమర్శించారు. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్‌షిప్‌లను చెల్లించలేదని. వచ్చేనెలా  1 లోపు విద్యార్థుల ఖాతాల్లో నిధులను జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2004లో కాంగ్రెస్ అధిష్ఠానం ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డిని నియమించి తప్పు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండటం వల్లే జగన్ నేడు ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, కాంగ్రెస్ తోనే ఏపీ కి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఏపీ కాంగ్రెస్ కు నూతన అధ్యక్షుడ్ని ఎన్నుకుంటామని, వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని అవుతారని చింతా మోహన్ అన్నారు.

కాంగ్రెస్ వ్యవహారాలపై రాహుల్ కీలక మంతనాలు చేస్తున్నారు. త్వరలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు రాహుల్ గాంధీ. ఆగస్టు 10వ తేదీన ఢిల్లీకి రావాలని కొంతమంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు ఇచ్చింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై చర్చించనున్నారు రాహుల్. ఏపీ రాష్ట్రానికి చెందిన కొద్దిమంది సీనియర్ నాయకులతో విడివిడిగా, ముఖాముఖి సమాలోచనలు జరపనున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీని ఏపిలో బలోపేతం చేసేందుకు రాష్ట్ర నేతల ఆలోచనలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకోనున్నారు. ఏపీలో కాంగ్రెస్ ప్రభావం తగ్గుతుండటంతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు డా. చింతా మోహన్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జే.డి. శీలం, మాజీ ఎమ్.పి డా. కే. వి. పి. రామచంద్ర రావు, ఏఐసిసి సెక్రటరీ గిడుగు రుద్రరాజు లాంటి నేతలతో  కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరుపుతోంది. ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని నియమించాలనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.