Rafael Nadal Academy : రఫెల్ నాదల్.. ప్రపంచ టెన్నిస్ స్టార్. ఆయన పుట్టింది స్పెయిన్‌లో. అయితేనేం మన తెలుగు గడ్డతో రఫెల్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. నాదల్ ఫౌండేషన్‌కు స్పెయిన్, దుబాయ్‌తో పాటు మన అనంతపురంలో టెన్నిస్ స్కూళ్లు ఉన్నాయి. 38 ఏళ్ల నాదల్ ఇటీవలే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సందర్భంగా అనంతపురం నాదల్ అకాడమీపై కథనమిది.
Also Read :Volcano Eruption : బద్దలైన అగ్నిపర్వతం.. గ్రామాలపై పడిన వేడి బూడిద.. 9 మంది మృతి
అనంతపురం నాదల్ అకాడమీ వివరాలివీ..
- కాస్ట్లీ క్రీడగా పేరొందిన టెన్నిస్‌ను పేదలకు చేరువ చేసే ఉద్దేశంతో అనంతపురంలో(Rafael Nadal Academy) నాదల్ అకాడమీ ఏర్పాటైంది.
- రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)తో ఉన్న అనుబంధంతో అనంత క్రీడా గ్రామంలో నాదల్ ఎడ్యుకేషనల్ అండ్ టెన్నిస్ స్కూలును ప్రారంభించారు.
- నాదల్ టెన్నిస్ పాఠశాల ప్రారంభోత్సవం 2010 అక్టోబరు 17న జరిగింది. ఈ కార్యక్రమంలో నాదల్‌తో పాటు ఆయన తల్లి మరియా ఫెరారా పాల్గొన్నారు.
- నాదల్ అకాడమీ నిర్వహణకు ప్రతి సంవత్సరం రూ.55 లక్షలు పంపిస్తుంటారు.
- నాదల్ అకాడమీలో చేరే వారు ఫ్రీగా టెన్నిస్ నేర్చుకోవచ్చు. పౌష్టికాహారం, ఆంగ్లంలో శిక్షణ, కంప్యూటర్‌పై అవగాహన కూడా కల్పిస్తారు.
- ఈ అకాడమీలో ఒక కోఆర్డినేటర్, ఒక కంప్యూటర్ ట్రైనర్, ముగ్గురు టెన్నిస్ ట్రైనర్లు, ఇద్దరు వాలంటీర్లు, టెన్నిస్ కోర్టుల నిర్వహణకు ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
- ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో టెన్నిస్‌లో ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుంటారు.
- ట్రైనింగ్ పూర్తయిన తర్వాత యువత, విద్యార్థులకు రాగి జావ, అరటి పండ్లు, పాలు, గుడ్లు, చిక్కీలు, గుగ్గిళ్లు వంటి పౌష్టికాహారం అందజేస్తారు.
- కమ్యూనికేషన్ స్కిల్స్‌పై వారికి అవగాహన కల్పిస్తారు.
- కొత్తగా ఇక్కడ ట్రైనింగులో చేరే వారికి ఎర్రబంతితో టెన్నిస్ ఆడటం నేర్పుతారు.
- ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్, సర్వీసులు వంటివి చేసే పద్ధతులను నారింజ రంగు బంతితో నేర్పిస్తారు.
- స్మాష్, డ్రాప్, స్లైస్, నాబ్ షాట్లు ఆడే విధానాలను ఆకుపచ్చ రంగు బంతితో నేర్పిస్తారు.
- ఈ విభాగాల్లో రాటుదేలిన క్రీడాకారులను జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు.
- నాదల్ అకాడమీలో ఇప్పటివరకు దాదాపు 2,500 మందిని టెన్నిస్ క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. వీరిలో 25 మంది జాతీయ పోటీల్లో పాల్గొన్నారు.