Prime Minister Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం 4.15 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. సాయంత్రం 4.45 నుంచి 5.30 గంటల వరకు మోడీ రోడ్ షో ఉంటుంది. విశాఖలోని వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ ఏరియా నుంచి దాదాపు కిలోమీటర్ మేర రోడ్ షో ఉంటుంది. రోడ్ షో చేస్తూ సభ జరిగే మైదానానికి ప్రధాని చేరుకుంటారు. 5.30 గంటల నుంచి 6.45 గంటల వరకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తారు. అక్కడి నుంచే వర్చువల్‌గా దాదాపు రూ.2 లక్షల కోట్లు విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
Also Read :ISRO New Chief : ఇస్రో నూతన చీఫ్ వి.నారాయణన్ ఎవరో తెలుసా ?
ఈ నేపథ్యంలో 5 వేల మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో మోడీ(Prime Minister Modi) సభకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలు నగరానికి చేరుకొని ఏయూ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రధాని పర్యటించే ప్రాంతాలు రోడ్ షో, బహిరంగ సభ ప్రదేశాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. డ్రోన్ కెమెరాల వినియోగాన్ని నిషేధించారు. 48 గంటల పాటు విశాఖలో డ్రోన్లను ఎగురవేయ వద్దని జీవో విడుదల చేశారు. భద్రతా ఏర్పాట్లను 32 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ పరిసరాలను ప్రధాని మోడీకి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) తమ ఆధీనంలోకి తీసుకుంది. డీజీపీ ద్వారకా తిరుమల, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి భద్రతా చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6.50 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు మోడీ వెళ్తారు. రాత్రి 7.15 గంటలకు విశాఖ నుంచి విమానంలో ఒడిశాలోని భువనేశ్వర్‌కు ప్రధాని వెళ్తారు.
Also Read :Cashless Treatment : రోడ్డు ప్రమాద బాధితులకు రూ.లక్షన్నర నగదు రహిత చికిత్స : కేంద్ర మంత్రి గడ్కరీ
మోడీ శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులు..
- విశాఖ రైల్వే జోన్ ప్రధాన కేంద్రం, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ వంటి పలు ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
- నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీ నగర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులు, గుత్తి-పెండేకళ్లు రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
- 16వ నంబర్ హైవేలో చిలకలూరిపేట 6 లేన్ల బైపాస్ రోడ్డును మోడీ జాతికి అంకితం చేస్తారు.