Tomato – 50 Paisa : ప్రజలకు చుక్కలు చూపించిన టమాటా ధర ఘోరంగా పడిపోయింది. ఒకానొక దశలో కిలోకు రూ.200 దాకా పలికిన టమాటా ధర.. ఇప్పుడు 50 పైసల రేంజ్ కు డౌన్ అయింది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో గత కొన్ని రోజులుగా కిలోకు 4 రూపాయల దాకా పలికిన టమాటా ధర.. ఆదివారం సాయంత్రానికి 50 పైసలకు చేరింది. దీంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటుండగా.. రైతులు మాత్రం లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. తెలంగాణతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు భారీగా పడిపోయాయి. ఇంతకుముందు ఇదే పత్తికొండ మార్కెట్లో 23 కేజీల టమాట బాక్స్ ధర రూ.4300 పలికింది.అంటే కిలో రేటు రూ.200కు పైమాటే. ఇప్పుడు కిలోకు 50 పైసలు లెక్కన 23 కేజీల టమాటా బాక్సు కేవలం 15 రూపాయలలోపే. దీంతో తమకు కనీసం రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read : AMB In Bangalore : బెంగళూరులోనూ మహేష్ బాబు AMB సినిమాస్.. లాంఛ్ ఎప్పుడంటే ?
ఒక్కసారిగా టమాట స్టాక్ భారీగా మార్కెట్లోకి రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. అకస్మాత్తుగా ధర ఆకాశానికి అంటడం.. ఒక్కసారిగా పాతాళానికి తాకడం అటు రైతులకు, ఇటు సామాన్య ప్రజలకు ఎంతో ఇబ్బందికరం!! ధరలు ఈవిధంగా భారీ హెచ్చుతగ్గులకు లోనుకాకుండా నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ ఆ దిశగా చర్యలు లేవు. నిత్యావసరాల ధరల కంట్రోల్ కు ప్రత్యేక వ్యవస్థను (Tomato – 50 Paisa) వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నిపుణులు సూచిస్తున్నారు.