PV Sunil Kumar: వైఎస్సార్ సీపీ హయాంలో ఏపీ శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో నాటి ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. విదేశీ పర్యటనల విషయంలో సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని తేలడంతో గత ఆదివారం రోజే ఆయనను సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సునీల్ కుమార్‌పై కేసు నమోదుకు రంగం సిద్ధమవుతోంది. అగ్రిగోల్డ్ బాధితుల ప్యాకేజీ సొమ్ము దారి మళ్లించారంటూ పీవీ సునీల్‌తో పాటు కామేపల్లి తులసి బాబుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పీవీ సునీల్ కుమార్(PV Sunil Kumar) విచారణకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్‌ను ఏసీబీ అనుమతి కోరింది. సెక్షన్ 17 కింద విచారణకు సీఎస్ అనుమతి మంజూరు చేశారు.
Also Read :New MLCs : తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల నేపథ్యం ఇదీ..
సునీల్ కుమార్ కెరీర్ గురించి..
- పీవీ సునీల్ కుమార్ గుంటూరు జిల్లా వాస్తవ్యులు.
- ఆయన బిహార్ క్యాడర్‌కు చెందిన 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
- వైఎస్సార్ సీపీ హయాంలో బిహార్ నుంచి డిప్యూటేషన్‌పై తీసుకొచ్చి, ఏపీ సీఐడీలో డీఐజీగా అవకాశం కల్పించారు.
- 2019 డిసెంబర్ నుంచి 2023 వరకు ఆయన సీఐడీలో విధులు నిర్వహించారు.
- ప్రస్తుత శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడిపై నమోదైన కేసుల విచారణలోనూ సునీల్ కుమార్ భాగమయ్యారు.
- సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో అప్పటి దర్యాప్తు అధికారి విజయ్‌పాల్ ఆధ్వర్యంలోని అధికారులు రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి గుంటూరులోని కార్యాలయంలో విచారించారు. ఆ సమయంలో సునీల్ కుమార్ అక్కడే ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
- అప్పట్లో సీఐడీలో పనిచేసిన పలువురు అధికారులు, సిబ్బందిని దర్యాప్తు అధికారి, ఎస్పీ దామోదర్ విచారించారు.
- ఈ నేపథ్యంలో నాటి కేసులో విచారణకు హాజరు కావాలంటూ మెయిల్, వాట్సాప్ ద్వారా సునీల్‌కు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. దీనిపై బిహార్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సైతం సమాచారం ఇచ్చారు.