ఇంటర్ విద్యార్థిని (Student of Inter)పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వైస్సార్ జిల్లా బద్వేలు సమీపంలో చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినిపై విగ్నేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి హత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కొందరు మహిళలు గుర్తించి విద్యార్థినిని రక్షించి పోలీసులకు సమాచారం అందిచారు.
స్థానికులు తెలిపిన ప్రకారం.. బద్వేల్ (Badwel) సమీపంలోని రామాంజనేయనగర్‌కు చెందిన ఓ బాలిక స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఈ క్రమంలో విఘ్నేష్ (20) అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేశాడు. శనివారం బాలికను సెంచరీ ఫ్లైఉడ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి మాట్లాడదామని పిలిపించి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. హైవేపై తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని గుర్తించిన స్థానికులు కడప రిమ్స్‌కు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బద్వేల్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో తమ కుమార్తెను విఘ్నేష్ వేధిస్తున్నాడని , 8వ తరగతి నుంచే విఘ్నేష్ వేధిచేవాడని అతనికి వివాహమైనా తమ కుమార్తె వెంట పడేవాడని బాలిక తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఈ ఘటన పై ఎస్పీ స్పందిస్తూ..బాధిత విద్యార్థినికి 80 శాతం గాయాలయ్యాయని , ప్రస్తుతం ఆమెను కడప రిమ్స్‌లో చేర్పించి చికిత్స కొనసాగిస్తున్నామని తెలిపారు. చిన్నప్పటి నుంచే ఇద్దరికీ పరిచయం ఉందని, ఇద్దరూ ఒక ప్రాంతానికి చెందిన వారేనని ఎస్పీ వివరించారు. తనను కలవాలని విద్యార్థినికి విఘ్నేష్ ఫోన్ చేశాడని, కలవకపోతే చనిపోతానని బెదిరించాడని అన్నారు. ఇద్దరూ పీపీకుంట చెక్‌పోస్ట్ సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లాక విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి విఘ్నేష్ పరారయ్యాడని అన్నారు. నిందితుడి ఆచూకీ కోసం 4 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ హర్షవర్ధన్ వివరించారు.
Read Also : Chhattisgarh : నక్సలైట్ల బాంబ్ దాడిలో ఇద్దరు బార్డర్ పోలీసుల మృతి