Site icon HashtagU Telugu

AP Politics: ఏపీలో వ్యక్తుల చుట్టూ రాజకీయాలు..!

AP Politics

Compressjpeg.online 1280x720 Image (2) 11zon

By: డా. ప్రసాదమూర్తి

AP Politics: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఏపీలో రాజకీయం (AP Politics) మాత్రం తన చుట్టూ తాను తిరుగుతూ వ్యక్తుల చుట్టూ తిరుగుతోంది. వాస్తవానికి ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల బరిలోకి నాయకులు దిగుతున్నప్పుడు ప్రజల ముందు అనేక ఆర్థిక సామాజిక అభివృద్ధికర అంశాలను కేంద్రంగా చేసుకొని యుద్ధం సాగిస్తారు. అధికారంలో ఉన్న పార్టీ తన హయాంలో చేసిన అభివృద్ధి ఎంత.. చేసిన వాగ్దానాలు ఏంటి.. అమలుపరిచిన హామీలు ఏంటి.. మొదలైన అంశాలు ఎన్నికల్లో దృష్టిని కేంద్రీకరించాలి. కానీ ఏపీ రాజకీయాల్లో ఎటు తిరిగి ఎటు చూసినా అన్ని పార్టీల నాయకులచుట్టూ తిరుగుతున్నట్టే కనిపిస్తోంది.

జగన్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన తీరు, మరిన్ని హామీలు, మరన్ని అభివృద్ధికర పథకాలతో ఎన్నికల్లోకి దిగాలి. కానీ దీనికి పూర్తి యూ టర్న్ తీసుకున్నారు జగన్. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలో లేకపోతే రణరంగంలో తమ విజయం అతి సునాయాసం అని జగన్ భావించినట్టుగా తెలుస్తోంది. చేసిన అభివృద్ధిని చూపించి, అంతకుముందు ప్రతిపక్షాలు చేసిన పనులతో దాన్ని బేరీజు వేసుకొని ప్రజలను ఓట్లు అడగాలి పాలకవర్గాలు. కానీ ఆంధ్రప్రదేశ్ లో అలా జరగలేదు.

అధికార పార్టీ సాగిస్తున్న నిష్ఫల నిరర్థక పాలన మీద నిప్పులు కక్కుతూ చంద్రబాబు చేస్తున్న రోడ్ షోలు, జరుపుతున్న సభలు ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇది అధికారంలో ఉన్న వైసీపీకి ప్రాణ సంకటంగా మారింది. మహాప్రవాహంగా దూసుకుపోతున్న చంద్రబాబుకు ఎక్కడో ఓ చోట అడ్డుకట్ట వేయకపోతే తమ పునాదులు కదిలే ప్రమాదం ఉందని జగన్ ఊహించినట్టు ఉన్నారు. అందుకే బాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించి అరెస్టు చేయించి ఆయన బయటకు రాకుండా కేసు మీద కేసు పెడుతూ రాజకీయమంత్రాంగం రచిస్తున్నారు.

అంతేకాదు, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని, దాని నాయకులను ఇరకటంలో పెట్టడంతో పాటు పవన్ కళ్యాణ్ పైన కూడా వైసీపీ నాయకులు తీవ్రంగా వ్యక్తిగత దూషణలతో విరుచుకుపడ్డ ఉదాహరణలు కోకొల్లలు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన వైవాహిక జీవితాన్ని ఎద్దేవా చేసి జనంలో ఆయన ప్రాభవాన్ని అపహాస్యం చేయాలని వైసిపి నాయకులు చూశారు. రాజకీయాలు వ్యవస్థ చుట్టూ తిరగాలి. వ్యవస్థలో లోపాలు సరిదిద్దడానికి, వ్యవస్థలో మంచిని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి, వ్యవస్థను రాజ్యాంగపరమైన అన్ని పునాదులతో బలోపేతం చేయడానికి ప్రయత్నించాల్సిన పాలకులు, ఇలా ప్రతిపక్షంలోని నాయకులు చుట్టూ తిరుగుతూ ప్రజల దృష్టిని ప్రధానమైన సామాజిక ఆర్థిక అంశాల నుంచి మళ్లించడానికి నిత్యం పనిచేశారు.

Also Read: Minister Amarnath : అవినీతిపై చ‌ర్చ‌కు సీఎం జ‌గ‌న్‌ను లోకేష్ పిల‌వ‌డం పెద్ద జోక్ : మంత్రి అమ‌ర్‌నాథ్‌

వైసిపి చేసిన, చేస్తున్న ఈ వ్యక్తిగత దాడులను అలా ఉంచితే, ఏపీలో ఇప్పుడు కీలక ప్రతిపక్ష నేతగా అనుకోని అవకాశాన్ని చేజిక్కించుకొని, రాబోయే ఎన్నికల్లో ఎంతో క్రియాశీల పాత్రను పోషించాల్సిన పవన్ కళ్యాణ్ కూడా కేవలం జగన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. మంగళగిరిలో నిన్న ఆయన తన కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడినప్పుడు జగన్ విధానాలను గాని జగన్ చేసిన అభివృద్ధి లేదా అవినీతి విషయాలను గాని పెద్దగా చర్చించలేదు. ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన కొనసాగిస్తున్న జగన్ ని రాజకీయాల్లో నామరూపాలు లేకుండా చేయడమే మన లక్ష్యమని పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలకు నాయకులకు ఉపదేశించారు.

కేవలం జగన్ అనే వ్యక్తిని ఆయన టార్గెట్ చేసి మాట్లాడడం ప్రస్తుత రాజకీయంలో ఆయనకు వ్యూహాత్మకమైన ఎత్తుగడ కావచ్చు. అందరూ, ముఖ్యంగా వైసిపి వర్గాలు తనను ప్యాకేజీ నాయకుడని, ఒక సామాజిక వర్గానికి తన సామాజిక వర్గం వారిని బానిసలు చేయడానికి పూనుకున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు పవన్. అంటే చంద్రబాబుకు చెందిన కమ్మ సామాజిక వర్గానికి మరో బలమైన కాపు సామాజిక వర్గానికి మధ్య ఘర్షణ పుట్టించి, ఆ ఘర్షణ నుంచి ఫలితాలు కొట్టాలని వైసిపి వ్యూహం.

ఆంధ్రప్రదేశ్ లో గతమంతా ఈ రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే ఉంది. ఈ వాతావరణాన్ని రూపుమాపి రెండు వర్గాల మధ్య సామరస్యాన్ని తీసుకురావడం అనేది పవన్ ముందున్న అతి ప్రధాన లక్ష్యమైంది. అందుకే పవన్ మాటిమాటికి జగన్ మీదే తన మాటల తూటాలు ఎక్కుపెట్టాడు. జగన్ అనే వ్యక్తి మరోసారి గెలిస్తే ఆంధ్ర రాష్ట్రం అంధకారమే అని, ఆయన్ని ఓడించడానికి మనం అన్ని శక్తుల్ని వాడుకోవాలని పవన్ తన కార్యకర్తలకు చేసిన ఉద్బోధ.

ఇలా ఏపీలో ఎవరు ఏం చేసినా.. దాని వెనక ఏ రాజకీయం ఉన్నా.. అదంతా వ్యవస్థ చుట్టూ కాక వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. వ్యక్తులైనా రాజకీయంలో భాగమే కాబట్టి అది కూడా రానున్న ఎన్నికల్లో కీలకమైన అంశమే కదా అని అనుకోవచ్చు కానీ ఏ వ్యవస్థకు అయినా వ్యక్తులు ప్రధానం కాదు. పార్టీలు ప్రధానం కాదు. ఆ వ్యవస్థను సర్వతోముఖంగా అభివృద్ధి చేసే పనులే ప్రధానం. అలాంటి పనుల మీదే అన్ని పార్టీల మాటలు గాని ఒకరిపై ఒకరు విసురుకునే ఈటెలు గాని కేంద్రీకృతమై ఉండాలి. ఏపీలో వాతావరణం ప్రస్తుతానికి అలా లేదు.