Four For One : `ఒకే ఒక్క‌డు` కోసం ఏపీలో నాలుగు స్తంభాలాట‌!

`ఒకే ఒక్క‌డి` కోసం న‌లుగురు(Four for One) ఒక‌ట‌య్యారు.

  • Written By:
  • Updated On - December 22, 2022 / 12:38 PM IST

`ఒకే ఒక్క‌డి` కోసం న‌లుగురు(Four for One) ఒక‌ట‌య్యారు. ఏపీలోని మూడు భాగాలపై ముగ్గురు క‌న్నేశారు. వాళ్ల‌కు ఢిల్లీ(Delhi) పెద్ద ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ కొమ్ముకాస్తున్నారు. ఇంత‌కీ ఎవ‌రా ఒక‌రు ఎవ‌రా న‌లుగురు అనుకుంటున్నారా? ఒకే ఒక్క‌డు చంద్ర‌బాబునాయుడు. ఆయ‌న్ను రాజ‌కీయ చ‌ద‌రంగం నుంచి త‌ప్పించ‌డానికి ఢిల్లీ(Delhi) బీజేపీ పెద్ద‌ కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ప‌వ‌న్ ల‌తో గేమాడిస్తున్నార‌ని రాజ‌కీయ పండితుల అనుమానం. ఆ క్ర‌మంలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల మీద జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌న్నేశారు. అక్క‌డికే ఎప్పుడూ ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు వెళుతుంటారు. గ‌త ఎనిమిదేళ్లుగా అప్పుడ‌ప్పుడైనా ఆయ‌న‌ గోదావ‌రి జిల్లాల చుట్టూ ఎక్కువ‌గా తిరిగారు. సొంత సామాజిక‌వ‌ర్గాన్ని బ‌లంగా న‌మ్ముకున్నార‌ని అందరికీ తెలిసిందే.

ప్ర‌స్తుతం ఢిల్లీ బీజేపీతో జ‌న‌సేనాని పొత్తు కొన‌సాగిస్తున్నారు. అక్క‌డి నుంచే వ‌చ్చే రూట్ మ్యాప్ ప్ర‌కారం న‌డుచుకుంటున్నారు. ఢిల్లీ పెద్ద చెప్పిన‌ట్టు ఆడుతున్నారు. ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఎజెండా ఇప్ప‌టి వ‌ర‌కు లేదు. చంద్ర‌బాబును క‌ల‌వాల‌న్నా ఢిల్లీ నుంచి సంకేతాలు రావాల్సిందే. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల గురించి మాట్లాడేందుకు ఏనాడూ ఢిల్లీ పెద్ద‌ల వ‌ద్ద సాహ‌సం చేయ‌లేదు. ఆ మేర‌కు అపాయిట్మెంట్ కూడా దొర‌క‌లేదు.

ఇటీవ‌ల ఒకేఒక‌సారి విశాఖ కేంద్రంగా భేటీకి అవ‌కాశం దొరిక‌న‌ప్ప‌టికీ సొంత రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల కోసం ప‌వ‌న్ ను ఢిల్లీ పెద్ద పావుగా ఉప‌యోగించుకున్నారు. దీంతో ఆ రోజు నుంచి జ‌న‌సేనాని తిక‌మ‌క ప‌డుతున్నారు. ఆయ‌న ఎప్పుడు ఏది మాట్లాడ‌తారో తెలియ‌కుండా ఉంది. అయితే, గోదావ‌రి జిల్లాల‌ను మాత్రం వ‌ద‌ల‌కుండా రాజ‌కీయంగా క‌న్నేసి ఉంచారు. అప్పుడ‌ప్పుడు విశాఖ వైపు చూస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ పాల‌న‌కు ప్ర‌శంసలు కురిపిస్తున్నారు.

బీజేపీతో క‌లిసిమెలిసి(Four for One)

ఎనిమిదేళ్ల నుంచి బీజేపీతో క‌లిసిమెలిసి తిరిగిన టీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ రూపంలో బీజేపీకి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆ రెండు పార్టీల మ‌ధ్య రాజ‌కీయ వైరం కొన‌సాగుతుంద‌ని ప్ర‌జ‌లు అనుకునేలా వ్య‌వ‌హారం న‌డుస్తోంది. అంతేకాదు, ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీ కూడా ఇస్తోంది. ప్ర‌త్యేకించి ఉత్త‌రాంధ్ర మీద కేసీఆర్ క‌న్నేశారు. ఆ ప్రాంతానికి చెందిన సొంత సామాజిక‌వ‌ర్గాన్ని పోగుచేస్తున్నారు. క‌నీసం 100 మంది లీడ‌ర్ల‌ను ఇప్ప‌టికే సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. క్రిస్మ‌స్ త‌రువాత ఉత్త‌రాంధ్ర మీద కేసీఆర్ ఫోక‌స్ మ‌రింత పెంచ‌బోతున్నారు. ఆ విష‌యాన్ని బీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే ఉత్త‌రాంధ్ర గ్రౌండ్లో బీఆర్ఎస్ నేత‌లు ప‌నిచేస్తున్నారు.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎప్పుడూ రాయ‌ల‌సీమ ప్రాంతంలో బ‌ల‌మైన రాజ‌కీయాన్ని న‌డుపుతారు. తొలి నుంచి వైఎస్ కుటుంబానికి ఇమేజ్ క‌డ‌ప జిల్లా వ్యాప్తంగా ఉంది. స్వ‌ర్గీయ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎం అయిన త‌రువాత ప్రాబ‌ల్యాన్ని క‌ర్నూలు, చిత్తూరుకు తొలుత విస్త‌రించారు. ప‌రిటాల ర‌వి హ‌త్య త‌రువాత అనంత‌పురంలోనూ వైఎస్ కుటుంబం హ‌వా క్ర‌మంగా పెరిగింది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం కావ‌డానికి రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాలు అండ‌గా నిలిచాయి. నెల్లూరు జిల్లాతో స‌హా రాయ‌ల‌సీమ ప్రాంతం వైసీపీకి అడ్డాగా ఉంది.

ఢిల్లీ బీజేపీ పెద్దల‌ సూచ‌న

గ‌త మూడున్న‌రేళ్ల పాల‌నలో ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య గోదావ‌రి, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో వైసీపీకి బాగా వ్య‌తిరేకత ఉంద‌ని తాజా స‌ర్వేల్లోని సారాంశం. అందుకే, ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు తొలుత బీఆర్ఎస్ పార్టీ ప్ర‌వేశిస్తోంది. అక్క‌డ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు, సామాజిక ఈక్వేష‌న్ రూపంలో భారీగా చీల్చుకోవ‌డానికి స్కెచ్ వేశార‌ని తెలుస్తోంది. గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన బ‌లప‌డుతుంద‌ని స‌ర్వేల సారాంశం. అందుకే, అక్క‌డ ముక్కోణ‌పు పోటీ జ‌రిగేలా ప్లాన్ జ‌రుగుతోందని వినికిడి.

ఢిల్లీ బీజేపీ పెద్దల‌ సూచ‌న మేర‌కు ఎక్కువ‌గా ప‌వ‌న్ ఉభ‌య గోదావ‌రి జిల్లాల చుట్టూ ఎక్కువ‌గా తిరుగుతున్నారు. కోస్తాంధ్ర జిల్లాల్లో ఎంపిక చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్, జ‌న‌సేన, బీజేపీ రంగంలోకి దిగుతాయ‌ని తెలుస్తోంది. అంటే, వైసీపీ, బీజేపీ క‌లిసి ఆడుతోన్న గేమ్ కు బీఆర్ఎస్ ప‌రోక్షంగా స‌హ‌కారం అందిస్తుంద‌ని నిశితంగా ప‌రిశీలిస్తే అర్థం అవుతోంది. బీజేపీ చెప్పిన‌ట్టు ప్ర‌త్య‌క్షంగా జ‌న‌సేన న‌డుస్తోంది. వాస్త‌వంగా వైసీపీ, బీజేపీ మ‌ధ్య రాజ‌కీయ అనుబంధం ఉంది. ఆ రెండు పార్టీలు క‌లిసి చంద్ర‌బాబును టార్గెట్ గా చేసుకుని గేమాడుతున్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అందుకే ఉత్త‌రాంధ్ర‌లో బీఆర్ఎస్, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన పార్టీల‌ను పావులుగా నిలుస్తున్నాయ‌ని రాజ‌కీయ పండితుల క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌గా ఉంది. ఇదంతా చంద్ర‌బాబు టార్గెట్ గా న‌డుస్తోన్న నాలుగుస్థంభాలాట‌గా క‌నిపిస్తోంది.

Also Read : Pavan Kalyan:ఆప‌రేష‌న్ గ‌రుడ! ప‌వ‌న్ హ‌త్య‌కు కుట్ర‌!