మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి (YCP Party Office) పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2021 అక్టోబర్ 19న దాడి జరిగే ముందు వైసీపీ కార్యాలయం నుంచి ఎవరెవరు బయల్దేరారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే ఘటనకు సంబంధించి వైసీపీ నేత దేవినేని అవినాశ్ కు పోలీసులు నోటీసులిచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
దేవినేని అవినాష్‌తో పాటు అరవ సత్యంకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాము అడిగిన వివరాలు అందజేయాలని నోటీసులలో పేర్కొన్నారు. గుణదలలోని ఆయన ఇంటికి అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీరిద్దరితో పాటు మరికొందరు అనుమానితులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దేవినేని అవినాష్ ఇటీవల విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించగా శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. నిందితులు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు.
ఇప్పటికే ఈ కేసులో దాదాపు అర డజను వైసీపీ నేతలు విచారణ ఎదుర్కొంటున్నారు. వీరిలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రి జోగి రమేశ్, విజయవాడ నేత దేవినేని అవినాష్ వంటి వారు ఉన్నారు. వీరంతా హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కూడా కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరిన్ని పక్కా ఆధారాలు సేకరించేందుకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Read Also : High Court : జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చివేతపై హైడ్రాకు కోర్టు కీలక ఆదేశాలు